‘మరుగు’న దోచేశారు !  | Corruption In Construction Of Personal Toilets | Sakshi
Sakshi News home page

‘మరుగు’న దోచేశారు !

Mar 2 2020 10:32 AM | Updated on Mar 2 2020 10:33 AM

Corruption In Construction Of Personal Toilets - Sakshi

తలుపులు లేని మరుగుదొడ్డిలో మోటార్‌సైకిల్‌

బేస్తవారిపేట: ప్రతి ఇంటికి ఒక వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించి స్త్రీల ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే మహోన్నతమైన ఆశయంతో కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఆ ఆశయానికి అప్పటి టీడీపీ నాయకులు తూట్లు పొడిచారు. వారి అక్రమ వ్యవహారాలకు వ్యక్తిగత మరుగుదొడ్లనూ వదిలిపెట్టలేదు. నిర్మాణం పూర్తి చేయకుండానే మరుగుదొడ్ల బిల్లులు బొక్కేశారు. కొందరు సొంత డబ్బులతో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని కార్యాలయాల చుట్టూ బిల్లుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.

స్వచ్ఛభారత్‌ పథకంలో నిర్మించిన మరుగుదొడ్లలో అంతులేని అవినీతి జరిగింది. గ్రామ, మండల స్థాయి టీడీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై అందిన కాడికి దోచుకున్నారు. పలుచోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు. గుంతలు, తలుపులు, సెప్టిక్‌ ట్యాంకులు లేని అరకొర నిర్మాణాలతో బిల్లులు నొక్కేశారు. అప్పట్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చాలా మంది లబి్ధదారులు ముందుకు రాకపోవడంతో నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అధికార పార్టీ నాయకులు పనులు చేస్తామని అవినీతికి తెరలేపారు. బేస్తవారిపేట మండలంలోని గలిజేరుగుళ్ల పంచాయతీలోని చెన్నుపల్లి, బార్లకుంట, శింగరపల్లి, బాలీశ్వరపురం గ్రామాల్లో 215 మరుగుదొడ్లు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. 85 శాతం పూర్తి కాకుండానే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. రూ.లక్షల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి గుంతలు తీసి రింగులు వేశారు కానీ నిర్మాణం పూర్తి చేయలేదు. మరి కొన్నిచోట్ల నిర్మాణ పనులే మొదలు పెట్టలేదు. అసలు లబి్ధదారులకు తెలియకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు. పాతవాటిని కొత్తగా చూపించారు. దొరికినకాడికి దోచుకుని పంచుకు తిన్నారు.

 కోనపల్లె పంచాయతీలోని పోగుళ్లలో పూరిపాకల్లో జీవనం సాగిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పక్కా గృహం లేదు. 45 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. పొడవు, వెడల్పు తక్కువగా, లోతు తక్కువగా గుంత తీసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకున్నారు. గ్రామంలో ఒక్కరు కూడా వ్యక్తిగత మరుగుదొడ్డిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. అవి నిరుపయోగంగా మారాయి. రూ.లక్షలు ఖర్చుపెట్టిన ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. కాంట్రాక్టర్‌ జేబులు నింపడానికే పథకం ఉపయోగపడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పంచాయతీల్లో రూ.25 లక్షలుపైగానే అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరుగుదొడ్లను ఉపయోగించే పరిస్థితి లేదు 
మరుగుదొడ్లను సక్రమంగా నిర్మించలేదు. లోతు తక్కువగా రెండు–మూడు రింగులు వేసి నిర్మాణ పనులు పూర్తి చేశారు. స్నానం చేసేందుకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దీంతో నిర్మించిన మరుగుదొడ్లను ఉపయోగించడం లేదు.
-దొర తిరుపతమ్మ, పోగుళ్ల

నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నారు.. 
వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైంది. పనులు చేస్తామన్నా కాంట్రాక్టర్‌ గుంత తీసి రింగులు వేశారు. నిర్మాణ పనులు చేపట్టలేదు. అధికారుల జాబితాలో నిర్మాణం పూర్తయి నిధులు డ్రా చేసినట్లు ఉంది. గలిజేరుగుళ్ల పంచాయతీలో ఎక్కువ శాతం లబి్ధదారుల పరిస్థితి ఇదే. 
-ముత్తుముల రమాదేవి, శింగరపల్లె  

పనులు పూర్తి చేయకుండానే రూ.15 వేలు తీసుకున్నారు 
గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పనులు నేనే చేయిస్తానని తెలిపాడు. జేసీబీతో గుంతను తీయించాడు. అందులో రింగులు వేయించాడు. అవసరమైన పత్రాలు, వేలిముద్రలు తీసుకున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేయకుండానే వదిలివేశారు. కానీ ఆన్‌లైన్‌లో నిర్మాణం పూర్తి చేసి, రూ.15 వేలు చెల్లించినట్లు ఉంది.
-గువ్వా రాజమ్మ, శింగరపల్లె 

లబ్ధిదారులకు న్యాయం చేస్తాం.. 
నిర్మాణాలు పూర్తి చేయకుండానే నిధులు విడుదల చేయడంపై క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాం. రెండు గ్రామాల్లో లబి్ధదారుల జాబితా ప్రకారం పంచాయతీ కార్యదర్శితో ఇంటింటి సర్వే చేయిస్తాం. నేను రాకముందు జరిగిన నిర్మాణాలపై పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
కె.కవితాచౌదరి, ఎంపీడీఓ, బేస్తవారిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement