24 గంటల్లో మందులు అందేలా చూడాలి: సీఎం జగన్‌

Corona: YS Jagan Review Meeting With Health Department Officials - Sakshi

సాక్షి, అమరావతి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బైకులను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఇందుకు అవసరమైన బైకులు కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. డాక్టర్లు ప్రిస్కిప్షన్‌ ఇవ్వగానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలని, దీని కోసం సిబ్బందికి బైకు, థర్మో బ్యాగులు కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌-19 నివారణ చర్యలపై అధికారులతో చర్చించారు. (మాస్కులు లేకుండా రోడ్డెక్కితే అంతే! )

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. టెలి మెడిసిన్‌ను మరింత విజయవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు పూర్తి చేశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దీనిపై మాట్లాడిన వైఎస్‌ జగన్‌ పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు కూడా దీంట్లో భాగమని తెలిపారు. కోవిడ్‌-19 కాకుండా ఇతర కేసులు ప్రతి రోజు ఎన్ని వస్తున్నాయన్న దానిపై వివారాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా పలువురు అధికారులు హాజరయ్యారు. (గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష)

విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్
లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం విదేశాల్లో చిక్కుకుపోయిన వారు దేశంలోకి వచ్చే కార్యక్రమం ప్రారంభమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గల్ఫ్‌ నుంచే కాకుండా యూకే, యూఎస్‌ నుంచి కూడా కొంత మంది వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రానికి వచ్చే వారందరికీ క్వారంటైన్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న షెల్టర్లు, క్వారంటైన్‌ కేంద్రాలు బాగుండేలా చూడాలన్నారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న 75 వేలకు పైగా పడకలను ముందస్తుగా వినియోగించుకోవాలని, వాటి సంఖ్యను 1 లక్ష వరకు పెంచాలని అధికారులను ఆదేశించారు. 75 వేల క్వారంటైన్‌ పడకలు వినియోగించినా, మిగిలినవి స్పేర్‌లో ఉంచాలని, వాటన్నింటిలో ఏ లోటు లేకుండా సదుపాయాలు కల్పించాలని, క్వారంటైన్‌లలో సదుపాయాలను మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అదేశించారు. 

వ్యవసాయంపై సమీక్ష
బత్తాయి రిటైల్‌ అమ్మకాల్లో ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వాలన్న అధికారుల సూచనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. పసుపు, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుండగా, పక్క రాష్ట్రాలలో ధరలు అమలు చేయకపోవడంతో అక్కడి నుంచి రైతులు ఆ పంటలు తీసుకువస్తున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి పసుపు, మొక్కజొన్న తక్కువ ధరకే వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నుంచి పసుపు, మొక్కజొన్న ఇక్కడికి వస్తే రాష్ట్రరైతులకు నష్టం వస్తుందని, దానిని నివారించాలని అధికారులు కోరారు. ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. (ఏం జరిగింది పెద్దాయనా?)

రైతు భరోసా పథకంలో మిగిలిపోయిన వారెవరైనా ఉంటే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని,  మరుసటి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే పాస్‌లు అనుమతించాలని అధికారులకు ముఖ్యమంత్రికి సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెరుచుకుంటున్న దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మాస్కులు ధరించేలా అవగాహన కలిగించాలన్నారు. ఇప్పటికి 6 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం మాస్క్‌లు పంపిణీ చేసిందని, ప్రతిరోజూ 42 లక్షల మాస్క్‌ల తయారీ చేస్తుందని వివరించారు. (మ‌హారాష్ర్ట‌లో లాక్‌డౌన్ పొడిగింపు! )

ఫిషింగ్‌ హార్బర్లపై సమీక్ష
రాష్ట్రంలో అదనంగా మరో ఫిషింగ్‌ హార్బర్, 2 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనుమతిచ్చారు. విజయనగరం జిల్లాలో ఒక ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించనున్నారు. దీంతో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం 9కి చేరనుంది. వీటితో పాటు విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, నక్కపల్లిలో మరో 2 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల సంఖ్య 3కు పెరిగింది. (విషాదం: ఛిద్ర‌మైన వ‌ల‌స కార్మికుని కుటుంబం )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top