రాష్ట్ర సమైక్యత కోసం జిల్లా ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు రూపాల్లో నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యత కోసం జిల్లా ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు రూపాల్లో నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోకుండా చూడాలంటూ ప్రజాప్రతినిధులకు ఆందోళనల ద్వారా విజ్ఞప్తులు పంపుతున్నారు. జిల్లాలో శనివారం వరుసగా 74వ రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
ఒంగోలు నగరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ కార్యాలయాల వద్ద సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా చీరాలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐదుగురు రిలే దీక్షలో కూర్చున్నారు. అలాగే మున్సిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు కూడా రిలే దీక్షలు చేపట్టారు. వేటపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలో కూర్చున్నారు. గిద్దలూరులోనూ సమైక్యవాదులు దీక్షలు చేస్తున్నారు. సమైక్యాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు దీక్షలకు కూర్చున్నారు. రాష్ట్ర విభజనపై కనిగిరిలో నిరసనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు. మార్కాపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పొదిలిలో పలువురు సమైక్యవాదులు రోడ్డుపై పడుకుని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు.