పంట సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం

CM YS Jaganmohan Reddy Orders Agriculture and Revenue Officers About Crop Problems - Sakshi

వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

ఇ–పంటతో వ్యవసాయ రంగంలో మేలి మలుపు

థర్డ్‌ పార్టీ ద్వారా ఎరువులు, విత్తనాల నాణ్యత నిర్ధారణ

ఇ–పంట నమోదుకు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌

రైతు భరోసా కేంద్రాలు సమర్థవంతంగా పని చేయాలి

సాక్షి, అమరావతి: పంటలకు సంబంధించి రైతు నుంచి ఏదైనా సమస్య వస్తే 24 గంటల్లో పరిష్కారం అయ్యేలా వ్యవసాయాధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పంట సమస్యలపై ఏర్పాటు చేసే కాల్‌ సెంటర్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమర్థవంతంగా పని చేసేలా తీర్చిదిద్దాలన్నారు. ఎలక్ట్రానిక్‌ పంటల నమోదు (ఇ–క్రాప్‌ బుకింగ్‌) విధానం వ్యవసాయ రంగంలో కీలక మలుపని అభివర్ణించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇ–పంట నమోదు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, పని తీరు గురించి ఆరా తీశారు. గత సమావేశాల్లో వచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆండ్రాయిడ్‌ ఆధారిత అప్లికేషన్‌ను రూపొందించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇ–పంట నమోదుతో పంటల బీమా, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు, ఏయే పంట ఎన్ని ఎకరాల్లో సాగయిందీ, ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించాల్సి వస్తే లబ్ధిదారులు ఎవరనేది సత్వరమే గుర్తించి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని సీఎం అన్నారు. ఇ–పంట విధానాన్ని బ్యాంకులకు అనుసంధానం చేస్తే సకాలంలో రుణాలు ఇవ్వడానికి, వేసిన పంటలకు తగినట్టుగా రుణం పొందడానికి ఉపయోగపడుతుందన్నారు.  

సమగ్ర వివరాలతో ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ 
– గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ, అనుబంధ రంగాల అసిస్టెంట్లు ఇ–పంట నమోదు వ్యవహారం చూస్తారు.
– ఆహార పంటలతో పాటు ఉద్యాన, పట్టు (సెరికల్చర్‌), పశు దాణాకు సంబంధించిన పంటల, సాగు వివరాలు ఇందులో ఉంటాయి.
– ఏ తరహా సాగు, ఎన్నో పంట, చేపల పెంపకమా? ఉద్యాన పంటా? అంతర పంటలు ఏమైనా సాగు చేస్తున్నారా? వంటి వివరాలు సైతం నమోదు చేస్తారు.
– ప్రస్తుత రబీ సీజన్లో ఈ అప్లికేషన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. 

ఇవీ ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు 
– గతంలో మాదిరి వెబ్‌ల్యాండ్‌ నమోదులో రైతులు ఈసారి ఇబ్బందులు పడకూడదు.
– సాగు చేసే ప్రతి పంటను, రైతును నమోదు చేయాలి.
– ఇ–పంట నమోదు డేటా బ్యాంకులతో అనుసంధానం చేయాలి.
– ఇందు వల్ల సాగు చేసిన పంటలకు తగిన రీతిలో రుణాలు పొందే అవకాశం లభిస్తుంది.
– ఇ–పంటతో పంటల బీమా సమగ్రంగా, వేగంగా పొందవచ్చు. 
– ఏ పంట సాగు చేస్తున్నది ముందుగానే తెలుస్తున్నందున ఆయా ఉత్పత్తులకు మార్కెట్లో ఎలాంటి రేట్లు లభిస్తున్నాయో పర్యవేక్షించొచ్చు.
– నష్టపోయే పరిస్థితి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్లో పోటీ పెంచడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రయత్నించాలి.  
– ముందుగానే కనీస గిట్టుబాటు ధరలు ప్రకటించి వాటికన్నా తక్కువకు రైతులు అమ్ముకునే దుస్థితి లేకుండా చూడాలి. 
– రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్త బాధ్యతగా ఇ–క్రాపింగ్‌ను చేపట్టాలి.
– దీనిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను రూపొందించుకోవాలి.
– ఇ–పంట నమోదు చేసేటప్పుడే బోర్ల కింద సాగవుతున్న భూములనూ గుర్తించాలి. డేటాలో ఆ విషయమూ ఉండాలి.

 రైతు భరోసా కేంద్రాలపై సీఎం సూచనలు
– ఏ పంటలు వేయాలనే దానిపై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలి.
– మెరుగైన సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి.
– సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులను రైతులకు నేర్పించాలి.
– నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను అందుబాటులో ఉంచి పంపిణీ అయ్యేలా చూడాలి.
– థర్డ్‌ పార్టీ కింద ఒక ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా విత్తనాలు, ఎరువుల నాణ్యత నిర్ధారణ పరీక్షలు చేయించాలి.
– ఇ–పంట కింద వివరాలు నమోదు చేయాలి.
– గిరాకీ– సరఫరాను దృష్టిలో ఉంచుకుని వేయాల్సిన పంటలపై రైతులకు సూచనలు చేయాలి.
– పంటల వివరాలను గ్రామ సచివాలయాల్లో పొందుపరచాలి.  
– రైతు భరోసా కేంద్రాల్లో పెట్టే కియోస్క్‌లో ఉంచాల్సిన వివరాలు, డేటాపై శ్రద్ధ పెట్టాలి.

ఇ–పంట అంటే?
ఎలక్ట్రానిక్‌ పంట నమోదే ఇ–క్రాప్‌ బుకింగ్‌. ఇదో మొబైల్‌ ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌. దీన్ని స్థానికంగా ఇ–పంటగా పిలుస్తున్నారు. వాస్తవ సాగు వివరాలను తెలుసుకునేందుకు రూపొందించిన అప్లికేషన్‌ ఇది. ఏయే గ్రామంలో ఎన్నెన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారో, ఎవరెవరు చేస్తున్నారో, ఏ రకంగా సాగు చేస్తున్నారో వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కాలం (ఖరీఫ్, రబీ), వర్షపాతం, భూసారం, విత్తనం, సర్వే నంబర్, గ్రామం పేరు, సాగు నీటి పారుదల సమాచారం ఇందులో ఉంటుంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top