2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – నవంబర్ మధ్య 21.37 కోట్ల పనిదినాలు కల్పించి గ్రామీణ ఉపాధికి వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా
ఇప్పటికే 18.63 లక్షల మంది(7.48 లక్షల కుటుంబాలు)కి సంబంధించిన జాబ్ కార్డులు ఎగరగొట్టిన చంద్రబాబు సర్కారు
రాష్ట్రంలో జూలై తర్వాత ఉపాధి కూలీలకు రూ.381 కోట్ల చెల్లింపులు బంద్
లేబర్ కాంపొనెంట్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామీణ నిరుపేద కూలీల అగచాట్లు
సాక్షి, అమరావతి: ఒకపక్క ఏడున్నర లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు.. మరోవైపు దాదాపు ఐదున్నర కోట్ల పనిదినాల కోతలు.. ఇంకోవైపు లేబర్ కాంపొనెంట్ కింద నాలుగు నెలలకుపైగా ఉపాధి కూలీలకు వేతనాల బకాయిలు..! ఉపాధి పనులనే నమ్ముకున్న గ్రామీణ నిరుపేదలను చంద్రబాబు సర్కారు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. పనిదినాల్లోనూ కోతలు విధిస్తూ, చేసిన పనులకు వేతనాలు చెల్లించకుండా అగచాట్లకు గురి చేస్తోంది.
గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు గత నాలుగున్నర నెలలుగా వేతనాలు (కూలి డబ్బులు) చెల్లించకపోవడంతో పేదలు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. స్వయంగా టీడీపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు రూ.381 కోట్ల మేర ఉపాధి హామీ కూలి డబ్బుల బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. ఈ ఏడాది జూలై 27వతేదీ తర్వాత రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలెవరికీ వేతనాలు అందలేదని సమాచారం.
మూడో వంతు ఎస్సీ, ఎస్టీలే..
చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఇటీవలే 18.63 లక్షల మంది జాబ్ కార్డు(7.48 లక్షల కుటుంబాలు)లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో లబ్ధి పొందుతున్న వారిలో మూడోవంతుకు పైగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే ఉన్నాయి. గతేడాది జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు రూ.వందల కోట్ల మేర వేతన బకాయిలు పేరుకుపోతున్నాయి. కూలి డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని వ్యవసాయ కారి్మక సంఘాలు వాపోతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దీపావళి సమయంలో నిరుపేదలు తాము చేసిన కూలి పనుల డబ్బుల కోసం ఆర్తిగా ఎదురు చూస్తూ, అవి చేతికి అందకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నారు.

ఐదున్నర కోట్ల పని దినాలకు ఎసరు..!
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనుల కల్పన తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి. వైఎస్ జగన్‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023–24లో రాష్ట్రంలో ఏప్రిల్ – నవంబరు మధ్య 21.37 కోట్ల పనిదినాల పాటు పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు 2025–26 ఏప్రిల్ – డిసెంబరు 7వతేదీ నాటికి కేవలం 15.94 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించింది. ఆర్నెలల్లో రూ.435.14 కోట్లు నష్టపోయిన పేదలు..
రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్– సెపె్టంబరు మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన తగ్గించడం వల్ల అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఆర్నెలల్లో రూ.435.14 కోట్ల మేర నష్టపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్ధారించింది. 2023–24లో గత ప్రభుత్వంలో ఉపాధి కూలీలు రూ.6,277 కోట్ల మేర లబ్ధి పొందగా 2024–25 లో రూ.6,183 కోట్లు మేర మాత్రమే ప్రయోజనం పొందారు.
జగన్ హయాంలో ఒక్క జిల్లాలోనే కూలీలకు రూ.2,700 కోట్లు
రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం జిల్లాలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020–21లో ఉపాధి కూలీలకు వేతనాల రూపంలో రూ.731 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఈ ఒక్క జిల్లాలోనే గత ప్రభుత్వం లేబర్ కాంపొనెంట్ కింద ఐదేళ్లలో రూ.2,700 కోట్లకుపైగా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించింది. అదే జిల్లాలో ఇప్పుడు సీఎం చంద్రబాబు సర్కారు 2024–25లో రూ.407 కోట్లు, ఈ ఆరి్థక ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు రూ.230 కోట్లు మాత్రమే కూలీలకు వేతనాలు చెల్లింపులు చేసింది.


