గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికి తేడా కనిపించాలి

CM YS Jagan Review Meeting On Spandana - Sakshi

ఇసుక మాఫియా అరికట్టాలి

అధికారులకు పూర్తి స్వేచ్ఛ

వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలి

స్పందనపై సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులు ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చడానికి సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రవాణ చేస్తామంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఎవరు ముందుకు వచ్చినా రవాణా కోసం వాహనాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. దీనిని అదునుగా తీసుకుని ఇసుక అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఇవ్వద్దని అన్నారు. 

సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఓపెన్‌ చేయండి. జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలి. ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలి. వరదలు తగ్గాయి, ఇసుక లభ్యత ఉంది. తక్కువ రేట్లకు అందించాలి. వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలి. ప్రతి జిల్లాలోని 2 వేలమంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువకులు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్‌ కలుపుకుని వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలి. వారికి ఇసుక రవాణా కాంట్రాక్టు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై మార్గదర్శకాలు తయారు చేయాలి. ఇదే సమయంలో ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడాలి. కలెక్టర్లు, ఎస్పీలు దీనిపై దృష్టిపెట్టాలి. రాజకీయ జోక్యాన్ని ఎక్కడా కూడా అనునమతించరాదు. గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా కచ్చితంగా కనిపించాలి. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదు. చెక్‌పోస్టుల్లో గట్టి నిఘాను పెంచండి’ అని పేర్కొన్నారు.

మంచి మైలురాయి అందుకున్నట్టే..
అక్టోబరు 2న (రేపు) గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం అవుతున్నాయి. డిసెంబర్‌ 1 నాటికి గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభం కావాలి. నవంబర్‌ నెలాఖరు నాటికి అన్ని సదుపాయాలు గ్రామ సచివాలయాలకు అందుతాయి. ఈలోగా గ్రామ సచివాలయాల కార్యాలయాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలి. గ్రామ వాలంటీర్లకు అందించే స్మార్ట్‌ఫోన్లతో సహా కంప్యూటర్లు ఇతరత్రా సదుపాయలన్నీ గ్రామ సచివాలయాలకు చేరాలి. ఏవైనా లోపాలు ఉంటే.. వాటిని డిసెంబరులో సరిదిద్దుకోవాలి. జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పౌరులకు అందాలి. వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో బోర్డులపై పెట్టాలి. జనవరి 1 నుంచి అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్‌ కార్డులు ఇవ్వాలి. ఈ మేరకు కార్యాచరణ సిద్ధంచేయాలి. గ్రామ సచివాలయాలు జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక ప్రతిరోజూ స్పందన కార్యక్రమం చేపట్టాలి. 72 గంటల్లోగా రేషన్‌కార్డు, పెన్షన్లు లాంటి సేవలు అందాలి. వివక్ష, పక్షపాతం లేకుండా, లంచాలు లేకుండా ప్రజలకు సేవలందాలి. ఇది జరిగితే.. ఒక మంచి మైలురాయిని మనం అందుకున్నట్టే. దీనికి సంబంధించిన యంత్రాంగం గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్లకు, శాఖాధిపతులకు అనుసంధానం ఉండాలి. దేశంలోనే ఇలాంటి కార్యక్రమం జరుగుతుందో లేదో నాకు తెలియదు. గ్రామాల వారీగా, వార్డుల వారీగా పరిపాలనలో ఇది విప్లవాత్మక మార్పు. కలెక్టర్లు, అధికారులు పూర్తిస్థాయిలో ధ్యాసపెట్టాల్సిన అవసరం ఉంది. తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు.. ఇతర. అధికారులతో మాట్లాడినప్పుడు.. ఈ అంశాలను వారికి వివరించండి’ అని సూచించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top