రైతు ముంగిటకే సమస్త సేవలు | Sakshi
Sakshi News home page

రైతు ముంగిటకే సమస్త సేవలు

Published Sat, May 30 2020 5:32 AM

CM YS Jagan to Inaugurate 10641 Rythu Bharosa Centres 30th May - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల ముంగిటకే, వారు తమ ఊరి నుంచి అడుగు బయట పెట్టకుండానే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం నేడు (శనివారం, మే 30) శ్రీకారం చుడుతోంది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏకకాలంలో 10,641 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను (ఆర్‌బీకేలు) శనివారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఆన్‌లైన్‌ వీడియో ద్వారా వీక్షిస్తూ వీటిని ప్రారంభించనున్నారు. మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్‌బీకేలో లభించే సేవలను పరిశీలిస్తారు. ప్రభుత్వం తాజాగా ఆవిష్కరించనున్న ఈ వ్యవస్థను రెండో హరిత విప్లవంగా వ్యవసాయ రంగ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. 

ఆర్బీకేల ప్రారంభ ప్రక్రియ ఇలా
► రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అన్ని సన్నాహాలు చేసింది. 
► 13 జిల్లాల నుండి 13 ఆర్‌బీకేలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అక్కడి రైతులతో మాట్లాడతారు.
► జిల్లా కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, అధికారులు పాల్గొంటారు.
► వ్యవసాయ, అనుబంధ శాఖల రైతుల కోసం పెట్టిన సమీకృత కాల్‌ సెంటర్‌ను కూడా సీఎం ప్రారంభిస్తారు. తొలి కాల్‌ చేసి మాట్లాడతారు. 
► వ్యవసాయ, అనుబంధ శాఖలు ప్రచురించిన కరపత్రాలు, పోస్టర్లు, చిరు పుస్తకాలు, వీడియోలు, డిజిటల్‌ సామాగ్రిని ఆవిష్కరిస్తారు. సాగుకు సంబంధించిన ఈ సమాచారం అంతా ఆర్బీకేలలోని లైబ్రరీలలో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. 
► రైతు భరోసా కేంద్రాల్లో ప్రధాన పాత్ర పోషించే కియోస్క్‌ నుంచి ఎవరైనా ఒక రైతు కోసం సీఎం స్వయంగా తొలి ఆర్డర్‌ను నమోదు చేసి సమీపంలోని హబ్‌కు వెళ్లిందో, లేదో పరిశీలిస్తారు. మార్కెటింగ్‌ శాఖ తయారు చేసిన సీఎం యాప్‌ను ప్రారంభిస్తారు. కర్నూలు జిల్లా పాండురంగపురంలోని ఆర్బీకేలో లభించే సేవలను పరిశీలిస్తారు. 
► ఉద్యాన శాఖ– వివిధ అంశాలపై రూపొందించిన– ఆరు రకాల పోస్టర్లను సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ప్రదర్శిస్తారు. 
► రాజన్న పశు వైద్యం పేరిట పశు సంవర్థక శాఖ రూపొందించిన పోస్టర్, పశు విజ్ఞాన బడి పుస్తకం, పశువుల ఆరోగ్య సంరక్షణ కార్డులను ఆవిష్కరిస్తారు.

గ్రామ సచివాలయాల సమీపంలోనే
సమగ్ర వ్యవసాయ కేంద్రాలుగా ఉండే రైతు భరోసా కేంద్రాలు  గ్రామ సచివాలయాల సమీపంలోనే ఉంటాయి. స్థలం దొరకనిచోట అద్దెకు తీసుకున్నారు. కొత్త భవనాలకు ఒక్కో భవనానికి 22 లక్షలు చొప్పున దాదాపు 10, 000 భవనాలకు రూ.2200 కోట్లు ఉపాధి హామీ పథకం నుంచి మంజూరు అయ్యాయి. అంతేకాకుండా 10, 461 ఆర్‌బీకేలు, 65 హబ్స్, భవనాల మరమ్మతులు, బ్రాండింగ్, అందుకు అవసరమైన సదుపాయాలు,  కియోస్క్‌లు, టీవీలు, ఫర్నిచర్, శిక్షణ పరికరాలు ఇంటర్నెట్‌ ఇతరత్రా అవసరాల కోసం మరో రూ.267 కోట్లకు పైగా వ్యయం చేసినట్టు అంచనా.

Advertisement
Advertisement