పాఠశాల విద్యకు కొత్త రూపు | CM YS Jagan High Level Review Meeting On Quality education and Jagananna Gorumudda | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యకు కొత్త రూపు

Jul 22 2020 3:06 AM | Updated on Jul 22 2020 10:53 AM

CM YS Jagan High Level Review Meeting On Quality education and Jagananna Gorumudda - Sakshi

స్కూళ్లలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్స్, పరిశుభ్రత పాటించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో హెల్త్‌ అసిస్టెంట్, డిజిటల్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎంల సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

ప్రతి మండలంలో ఒక జూనియర్‌ కాలేజీ
రాష్ట్రంలో 270 మండలాల్లో జూనియర్‌ కాలేజీలు లేవు. ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా మార్చేలా ఇదివరకే తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్యను అధిగమిస్తాం. 
► ప్రస్తుతం ఉన్న జూనియర్‌ కాలేజీల్లో  ఖాళీలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టాలి. ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే దిశగా కార్యాచరణ ఉండాలి.
► ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక భవనం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల శిక్షణకు సరైన పాఠ్య ప్రణాళికను అనుసరించాలి. 

ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు –నేడు కార్యక్రమాల్లో భాగంగా మధ్యాహ్న భోజనం తయారీ కోసం కిచెన్‌ షెడ్‌ను కూడా నిర్మించాలి. నాడు–నేడు కార్యక్రమాల్లో 10వ అంశంగా దీన్ని చేర్చాలి. మధ్యాహ్న భోజనం తయారీ కోసం వినియోగించే పాత్రలు, పరికరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. 

సాక్షి, అమరావతి: ఆరు సంవత్సరాలలోపు పిల్లల కోసం ప్రీ ప్రైమరీ–1 (ఎల్‌కేజీ), ప్రీ ప్రైమరీ–2 (యూకెజీ)లను ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కిండర్‌ గార్డెన్స్‌ (ఎల్‌కేజీ, యూకేజీ)పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. విద్యా రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. నాణ్యమైన విద్య, జగనన్న గోరుముద్దపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య, మానవ వనరుల సమర్థ వినియోగం, ఉత్తమ బోధన తదితర అంశాలపై చర్చించారు. స్కూలు పిల్లల కోసం రూపొందించిన పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.   

కిండర్‌ గార్డెన్‌పై ప్రత్యేక దృష్టి 
► ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2 (పీపీ–1, పీపీ–2) క్లాసులను కూడా ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకొచ్చి, వారికి నాణ్యమైన విద్యనందించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఇందుకు పకడ్బందీ పాఠ్య ప్రణాళిక ఉండాలి.  
► ఒకటో తరగతి నుంచి బోధించే పాఠ్యాంశాలతో పీపీ–1, పీపీ–2 పాఠ్యాంశాల మధ్య సారూప్యత ఉండాలి. పీపీ–1, పీపీ–2 విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలి. టీచర్ల విషయంలో రాజీ పడొద్దు.   
► రాష్ట్రంలో 55 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో దాదాపు 35 వేల కేంద్రాలకు భవనాలు లేవు. 
► కొత్త భవనాల నిర్మాణం కోసం స్థలాలు గుర్తిస్తున్నారు.  
► ప్రైమరీ స్కూళ్లకు సమీపంలోనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉండాలంటే.. ముందుగా ఆయా స్కూళ్లలో తగిన స్థలం ఉందా.. లేదా? అన్నదాన్ని పరిశీలించి, మ్యాపింగ్‌తో ఒక నివేదిక తయారు చేయాలి.   

క్యాంపు కార్యాలయంలో నాణ్యమైన విద్య, జగనన్న గోరుముద్దపై సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌కు నాంది 
► డిజిటల్‌ లెర్నింగ్, డివైజ్‌లపై అవగాహన కల్పించాలి. లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌కు ఇది నాంది కావాలి. దీని వల్ల పిల్లలు.. వారి తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుంది.  
► హై ఎండ్‌ డిజిటల్‌ లెర్నింగ్‌లో భాగంగా 8 లేదా 9వ తరగతిలో డాంగిల్, ఐపాడ్‌ ఇవ్వాలన్నది ఆలోచన.  8వ తరగతి నుంచి లైఫ్‌ స్కిల్స్, కెరీర్‌ కౌన్సెలింగ్‌ కార్యక్రమం మొదలవ్వాలి.  
► హైస్కూల్లో లైబ్రరీలు, సైన్స్‌ లేబరేటరీలు, ప్లే గ్రౌండ్స్, ఫిజికల్‌ లిటరసీ కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి. పిల్లలకు వ్యాయామం అన్నది పాఠ్య ప్రణాళికలో భాగం కావాలి. 
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల్లో ఐటీఐ, పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారికి నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాం. హైస్కూల్లో డ్రాప్‌ అవుట్‌ అయిన వారికి వివిధ పనుల్లో శిక్షణ ఇస్తాం. 

ప్రైవేటు స్కూళ్లకు అక్రిడిటేషన్‌ విధానం  
► ప్రైవేటు స్కూళ్లకు అక్రిడిటేషన్‌ విధానం, వాటి ఫీజులపై పర్యవేక్షణ ఉండాలి. ప్రతి ఏటా ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలుండాలి.  ఫిర్యాదు చేసేందుకు కంప్‌లైంట్‌ బాక్స్‌ ఉండాలి. ఒక యాప్‌ కూడా తీసుకురావాలి. 
► లంచాలు, ప్రలోభాలకు తావు ఉండకూడదు.  

ప్రాధాన్యత కార్యక్రమం గోరుముద్ద   
► మధ్యాహ్న భోజనంలో నాణ్యత, స్కూళ్లలో బాత్‌ రూమ్స్‌ పరిశుభ్రత చాలా ముఖ్యం. వీటిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. పాఠశాలలు తెరిచే సమయానికి అన్ని చర్యలూ తీసుకోవాలి.  
సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement