
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమయ్యే వరల్డ్ ఫుడ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) సదస్సులో ఆయన పాల్గొననున్నారు. షెడ్యూలు ప్రకారం ఆయన శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన హైదరాబాద్ నుంచి గురువారం రాత్రికే ఢిల్లీకి చేరుకోవడం గమనార్హం.
ఎవరిని కలవడానికి హడావుడిగా గురువారం రాత్రికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారన్నది అంతుచిక్కట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతోపాటు పలువురు కేంద్రమంత్రుల్ని సీఎం కలవడానికి వీలుగా అపాయింట్‌మెంట్ కోరినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అపాయింట్‌మెంట్‌ను బట్టి ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను చంద్రబాబు శుక్రవారం కలవనున్నారు.
బాబు కేంద్రమంత్రి జైట్లీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జైట్లీ అపాయింట్‌మెంట్ ఇస్తే పెంచిన అంచనాల మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరాలని సీఎం నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీ అపాయింట్‌మెంట్‌ను సైతం కోరడం గమనార్హం.