నరకాన్ని చూసొచ్చాం! | Chennai building collapse: 38 from Andhra Pradesh dead | Sakshi
Sakshi News home page

నరకాన్ని చూసొచ్చాం!

Jul 6 2014 2:31 AM | Updated on Sep 2 2017 9:51 AM

నరకాన్ని చూసొచ్చాం!

నరకాన్ని చూసొచ్చాం!

ఆ ఘటనే ఒక పెను విషాదం.. ఆ దృశ్యాలు అత్యంత భయానకం.. శిథిలాల కింద చితికిపోయిన శరీరాలు కొన్నయితే.. మరణానికి అతి చేరువగా వెళ్లి.. అక్కడి నుంచే

పాలకొండ రూరల్: ఆ ఘటనే ఒక పెను విషాదం.. ఆ దృశ్యాలు అత్యంత భయానకం.. శిథిలాల కింద చితికిపోయిన శరీరాలు కొన్నయితే.. మరణానికి అతి చేరువగా వెళ్లి.. అక్కడి నుంచే తప్పించుకునేందుకు క్షతగాత్రులు పడిన వేదన.. అనుభవించిన నరకయాతనను అతి సమీపం నుంచి చూడటం తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. రోజుల తరబడి అనుభవించిన యాతన.. చావు బతుకుల సంఘర్షణ. వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూడటం.. సహాయ చర్యల్లో పాలుపంచుకోవడం జీవితంలో మరచిపోలేని సంఘటనలని అంటున్నారు పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్.
 
 చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో జిల్లాకు చెందిన 14 మంది మృతి చెందగా, ఇద్దరు స్వల్పగాయాలతో బయట పడిన విషయం తెలిసింది. ఈ దుర్ఘటనలో చిక్కుకున్న జిల్లావాసులకు సహాయ చర్యలు చేపట్టేందుకు గత శనివారం చెన్నై వెళ్లిన బృందంలో ఆర్డీవోతోపాటు రాజాం తహశీల్దార్ జల్లేపల్లి రామారావు, హిరమండలం ఆర్‌ఐ శంకరరావులు ఉన్నారు. వారంపాటు సహాయ చర్యల్లో పాల్గొన్న వారు ఈ శనివారం అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ వారం రోజులు ఈ బృందం ఎదుర్కొన్న అనుభవాలను ఆర్డీవో తేజ్‌భరత్ ‘సాక్షి’తో ఫోనులో పంచుకున్నారు.ఆ విశేషాలు..
 
 సాక్షి: మీ బృందం చెన్నై చేరుకొనేసరికి పరిస్థితి ఎలా ఉంది?

 ఆర్డీవో: గత నెల 29 శనివారం సాయంత్రం జిల్లా అధికారుల సూచన మేరకు మా బృందం చెన్నై చేరుకుంది. రాత్రి 9 గంటల సమయంలో సంఘటన స్థలానికి వెళ్లాం. అక్కడి పరిస్థితి చూసి ఒళ్లు గగుర్పొడించింది. ఇన్నాళ్ల నా సర్వీసులో ఈ తరహా ఘటనను  చూడలేదు. నాతో పాటు వచ్చిన రాజాం తహశీల్దార్, హిరమండలం ఆర్‌ఐ ఎంతగానో సహకరించారు. శిథిలాలు, మృతదేహాలు, క్షతగాత్రులు, వారి బంధువుల రోదనల మధ్య పని చేయడానికి గుండె నిబ్బరం అవసరం.
 
 సాక్షి: మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏమిటి?
 ఆర్డీవో: చావుకు.. బతుకుకు మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంటుందో కళ్లారా చూశాం. చనిపోయింది ఎవరో.. వారి బంధువులు ఎవరో తెలియని పరిస్థితి వలస కూలీలది. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలు చేపట్టడంలో తొలుత కొంత ఆలస్యం జరిగింది. అసలు శిథిలాల కింద ఉన్న వారు ఎలా ఉన్నారో, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. తమ వారిని రక్షించాలంటూ వారి బంధువులు కనిపించిన వారందరి కాళ్ల మీద పడి రోదించిన దృశ్యాలు కలచివేశాయి.
 
 సాక్షి: గతంలో మీరు డీఎస్పీగా కూడా పనిచేశారు. ఆ అనుభవం ఇక్కడ ఏమైనా ఉపకరించిందా?
 ఆర్డీవో: డీఎస్పీగా పని చేసినప్పుడు ఎప్పుడూ పోస్టుమార్టాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి రాలేదు. కానీ ఇక్కడ రోజుల తరబడి భవన శిథిలాల కింద నుజ్జయిన పదుల సంఖ్యలో మృతదేహాలను చూడాల్సి వచ్చింది. లోపలకు వెళ్లి సాయమందిద్దామంటే చెన్నై అధికారులు మా బృందానికి అనుమతి ఇవ్వలేదు.

 సాక్షి: జిల్లాకు చెందినా.. గుర్తించని వారి మృతదేహాలు పంపించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
 ఆర్డీఓ: ఈ విషయంలో మాత్రం తమిళనాడు ప్రభుత్వం చొరవ చూపించింది. ప్రతి ఒక్క మృతదేహాన్ని గుర్తించిన అనంతరం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి బంధువులు, క్షతగాత్రులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారుల సంఖ్య ఎక్కువగా ఉండడం, మన జిల్లా నుంచి వెళ్లింది ముగ్గురు మాత్రమే కావడం కాస్త ఇబ్బంది కలిగించింది. అయినా రోజుకు 3 గంటలు మాత్రమే పడుకొని మిగిలిన సమయమంతి జిల్లా వాసులకు సహకరించడానికే వెచ్చించాం.
 
 సాక్షి: మీ సహచర ఉద్యోగులు ఎలా సహకరించారు?

 ఆర్డీవో: ఒడిశా, విజయనగరంతో పాటు మన జిల్లా నుంచి వెళ్లిన మేము సమన్వయంతో మనవాళ్ల ఆచూకీ కోసం ప్రయత్నించాం. 168 గంటలు సహాయ చర్యల్లో పాల్గొన్నాం. 28 గంటల పాటు మార్చురీలో గుర్తు తెలియని, చిధ్రమైన, కుళ్లిన మృతదేహాల మధ్య గడిపాం. కొన్ని సమయాల్లో ఎక్స్‌గ్రేషియా కోసం చెన్నైకి చెందిన బాధితులు కొందరు మృతదేహాలు తమవారివి కాకపోయినా తమవేనంటూ గొడవకు దిగారు. ఈ తరహా ఘటనలు ఎన్నో.
 
 సాక్షి : రాష్ట్రం నుంచి వచ్చిన రాజకీయ నాయకుల సహకారం అందిందా?
 ఆర్డీవో: వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా వచ్చి బాధితులను ఓదార్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు.
 
 సాక్షి: తమిళనాడు ప్రభుత్వం మనవారికి పూర్తిస్థాయిలో సాయం చేసిందా?

 ఆర్డీవో: జిల్లాకు చెందిన 16 మంది శిథిలాల్లో చిక్కుకోగా వారిలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఇద్దరు క్షేమంగా ఉండడంతో వారిని కూడా జిల్లాకు పంపించాం. మృతి చెందిన ప్రతి ఒక్కరికి  అక్కడి ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున రూ. 28 లక్షలు  ప్రకటించింది. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు చెక్కు రూపంలో పంపించనున్నారు. అలాగే క్షతగాత్రులకు ఎటువంటి ఆధారాలు చూపకపోయినా తక్షణ సాయం కింద రూ.50 వేలు చొప్పున అందించింది. మెరుగైన వైద్య చికిత్స చేయించడంతో పాటు బాధిత కుటుంబాలను అన్ని విధాలా సహకరించింది. వారం రోజుల పాటు అక్కడ జరిగిన విషయాలను, మేం చేపట్టిన కార్యక్రమాలను ఫొటోల రూపంలో జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement