చకచకా ‘చంద్రయాన్‌–2’ ఏర్పాట్లు  | Chandrayaan-2 arrangements was well going | Sakshi
Sakshi News home page

చకచకా ‘చంద్రయాన్‌–2’ ఏర్పాట్లు 

Jun 30 2019 4:37 AM | Updated on Jun 30 2019 4:38 AM

Chandrayaan-2 arrangements was well going - Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్‌–2 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్‌–2ను ప్రయోగించనున్నారు. ఇప్పటికే షార్‌లో రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో మూడు దశల జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ పనులను పూర్తిచేశారు. శనివారం పేజ్‌–3 లెవెల్‌–1 తనిఖీలను నిర్వహించారు. అదేవిధంగా శాటిలైట్‌ బిల్డింగ్‌లో ఆర్బిటర్‌ మిషన్‌ మీద ల్యాండర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేశారు.

చంద్రయాన్‌–2 మిషన్‌ను రాకెట్‌ శిఖర భాగంలో అమర్చేందుకు హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేసి, ఆ భాగాన్ని శాటిలైట్‌ బిల్డింగ్‌ నుంచి వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌కు ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయాన తరలించి రాకెట్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో రాకెట్‌ అనుసంధానం పనులన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత రాకెట్‌లో అన్ని తనిఖీలు నిర్వహించి ఊంబ్లికల్‌ టవర్‌ మీదకు తరలించే ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రయోగానికి గడువు మరో 15 రోజులే ఉండడంతో సెలవు దినాలను కూడా చూడకుండా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం నుంచి నూతన డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ పర్యవేక్షణలో అనుసంధానం పనులు జరుగుతాయి. జూలై 15న చంద్రయాన్‌–2 భూకక్ష్య నుంచి బయలుదేరి 3.50 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి సెప్టెంబర్‌ 6న చంద్రుడిపైకి చేరుతుంది. అదేరోజున ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్యలోకి చేరుకుని ల్యాండర్‌ను చంద్రుడిపై దించుతుంది. చంద్రుడిపై ల్యాండర్‌ దిగాక అందులో అమర్చిన రోవర్‌ బయటకొచ్చి పరిశోధనలు చేస్తుంది. ఈ లోపు ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్యలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది.  

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ ద్వారానే చంద్రయాన్‌–2.. 
640 టన్నులు బరువు కలిగిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ 3.8 టన్నుల బరువు కలిగిన చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని అంతరిక్షం వైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్‌–2 ఉపగ్రహంలో 2.3 టన్నుల బరువు కలిగిన ఆర్బిటర్, 1.4 టన్నులు బరువు కలిగిన ల్యాండర్‌ (విక్రమ్‌), 27 కిలోలు బరువు కలిగిన రోవర్‌ (ప్రజ్ఞాన్‌) అనే ఇండియన్‌ పేలోడ్స్‌తోపాటు అమెరికా, యూరప్‌ దేశాలకు సంబంధించిన అనేక పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. వీటితోపాటు ఆర్బిటర్‌లో 8 పేలోడ్స్, ల్యాండర్, రోవర్‌లో మూడేసి పేలోడ్స్‌ను పంపుతున్నారు.  

ఆర్బిటర్‌లో పంపే పేలోడ్స్‌ ఇవి.. 
- టెరియన్‌ మ్యాపింగ్‌ కెమెరా–2 (టీఎంసీ–2) 
- చంద్రయాన్‌–2 లార్జ్‌ ఏరియా సాఫ్ట్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (సీఎల్‌ఏఎస్‌ఎస్‌) 
- సోలార్‌ ఎక్స్‌రే మానిటర్‌ (ఎక్స్‌ఎస్‌ఎం) 
- ఆర్బిటర్‌ హైరిజుల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) 
- ఇమేజింగ్‌ ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌ (ఐఐఆర్‌ఎస్‌) 
- డ్యూయెల్‌ ఫ్రీక్వెన్సీ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ (ఎస్‌ఏఆర్‌) 
- చంద్రయాన్‌–2 అట్మాస్ఫియరిక్‌ కాంపోజిషనల్‌ ఎక్స్‌ప్లోరల్‌ 2 (సీహెచ్‌ఏసీఈ) 
- డ్యూయెల్‌ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్‌ (డీఎఫ్‌ఆర్‌ఎస్‌) ఎక్స్‌పరిమెంట్‌ 

ల్యాండర్‌ (విక్రమ్‌)లో పేలోడ్స్‌ ఇవి.. 
- రేడియో అనాటమీ ఆఫ్‌ మూన్‌ బౌండ్‌ హైపర్‌సెన్సిటివ్‌ ఐనోస్పియర్‌  అండ్‌ అట్మాస్ఫియర్‌ (ఆర్‌ఎఎంబీఏ) 
- చంద్రయాన్‌–2 సర్ఫేస్‌ థెర్మో–ఫిజికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ (సీహెచ్‌ఏఎస్‌టీఈ) 
- ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సీయాస్మిక్‌ యాక్టివిటీ (ఐఎల్‌ఎస్‌ఏ) 
- రోవర్‌ (ప్రజ్ఞాన్‌)లో పేలోడ్స్‌ ఇవి.. 
- అల్ఫా ఫర్టికల్స్‌ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్‌ (ఏఎప్‌ఎక్స్‌ఎస్‌) 
- లేజర్‌ ఇన్‌డ్యూస్‌డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (ఎన్‌ఐబీఎస్‌) 
- లేజర్‌ రెట్రో రిఫ్లెక్టర్‌ అర్రే (ఎల్‌ఆర్‌ఏ) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement