
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస కేంద్రాలను సందర్శించిన కేంద్ర కార్యదర్శి లీనా నైర్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంప్లాయ్‌మెంట్ కార్యదర్శి జి.లత కృష్ణారావులకు తమ గోడు చెప్పుకుందామంటే అవకాశం లేకపోయిందని నిర్వాసితులు ఆవేదన చెందారు.
పోలవరం రూరల్: రామన్నపాలెం, రామయ్యపేట, దేవరగొంది గ్రామాల్లో పర్యటించిన బృందం సభ్యులు కొందరు నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని వెళ్లిపోయారన్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న విషయం కూడా అధికారులు తమకు తెలియజేయలేదని, తాము చేరుకునే సరికి వారు వెళ్లిపోయారన్నారు. ముందుగా ఖాళీ చేసిన ఏడు గ్రామాల్లో నిర్వాసితులు సమస్యలు తెలిపేందుకు వచ్చేసరికి బృందం సభ్యులు వెళ్లిపోయారు. దేవరగొంది గ్రామానికి చెందిన కారం చెల్లాయమ్మ, వరస జోగమ్మలు మాట్లాడుతూ మా సమస్యలు చెప్పుకునేందుకు చేరుకునే సరికే అధికారులు వెళ్ళిపోయారని ఆవేదన చెందారు.
పోలవరం పనులపై ఆరా
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు. తిరిగి ఇరిగేషన్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పనులు జరుగుతున్న వివరాలను తెలిపారు. వ్యూపాయింట్ నుంచి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి లీనా నైర్, మరో కార్యదర్శి జి.లత కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ పునరావాస గ్రామాల్లో పర్యటించి పరిస్థితులు తెలుసుకున్నారు. రామన్నపాలెం, దేవరగొంది, రామయ్యపేట గ్రామ నిర్వాసితులను కలిసి మాట్లాడటం జరిగిందని, కొన్ని ఇబ్బందులు కూడా చెప్పారన్నారు. అధికారులు చెప్పిన దానికంటే ఇక్కడ నిర్వాసిత గ్రామాల పరిస్థితి పర్వాలేదన్నారు.
పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు శానిటేషన్, మంచినీరు తదితర వసతులపై కూడా ఆరా తీశామన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ గ్రేడులలో శిక్షణ ఇచ్చి ఎంప్లాయిమెంట్ ఇస్తున్నారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం మండలంలో 4,135 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. గిరిజనులకు ఏజెన్సీ పరిధిలోనే పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పోలవరం అథారిటి మెంబర్ సెక్రటరీ ఎస్‌కే శ్రీవాస్తవ, సీడబ్ల్యూసీ సీఈ ఆర్‌కే పచౌరి, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావులతో పాటు కలెక్టర్ కె.భాస్కర్, జేసీ పి.కోటేశ్వరరావు, ఐటీడీఏ పీవో హరేంద్రకుమార్, ఆర్డీఓ కె.మోహన్‌రావు, డీఎస్పీ ఏటీవీ రవికుమార్, ఈఈలు పీవీకుమార్, ఎన్.పుల్లారావు, ఎం.చంద్రరావు, పి.బుల్లియ్య ఉన్నారు.