బ్యాంకులు హ్యాండ్సప్‌

Cash Problems in Banks in Telugu States - Sakshi

తెలుగు రాష్ట్రాల్లోని 60 శాతం బ్యాంకుల్లో నో క్యాష్‌.. మళ్లీ చుట్టుముట్టిన కరెన్సీ కష్టాలు

ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు భయంతో పెరిగిన విత్‌డ్రాలు

ఐటీ నోటీసుల ఆందోళనతో తగ్గిన డిపాజిట్లు

పెరుగుతున్న డిఫాల్టర్లతో ఖాతాదారులు దూరం

విత్‌డ్రా చేసుకునేవారికి నగదు సర్దలేక బ్యాంకులు సతమతం

ఏటీఎంల పరిస్థితి మరీ ఘోరం.. పనిచేస్తున్నవి 20 శాతమే

కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు.. ఇటీవల ఆర్‌బీఐని నగదు కావాలని అభ్యర్థించింది. అంతే.. మూడు లారీల్లో రూ.2 కోట్లను పంపారు! అదేంటి లారీల్లో ఎందుకు పంపారంటారా? పంపినవన్నీ రూ.10 నాణేలు మరి! కూలీలను పెట్టి మరీ ఆ బస్తాలను దించుకుంది బ్యాంకు యాజమాన్యం. ఆర్‌బీఐ వద్ద తగినన్ని నోట్లు లేకపోవడంతో ఇలా నాణేల్ని పంపాల్సి వచ్చింది!
– నోట్ల కష్టాలకు ఇదో ఉదాహరణ

సాక్షి, బిజినెస్‌ విభాగం : పెద్ద నోట్ల రద్దు.. జనం నెత్తిన ఓ పిడుగు! దాచుకున్న డబ్బులు చేతికివ్వలేని బ్యాంకులపై జనం విశ్వాసం తగ్గటానికదే నాంది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎగవేతదారులు బయటపడటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇంతలో.. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు వస్తోందంటూ కథనాలు ఖాతాదారుల్ని కంగారెత్తించాయి.

రెండు లక్షలకన్నా ఎక్కువ డిపాజిట్‌ చేసినవారికి వచ్చిన ఐటీ నోటీసులు.. ఆ కంగారును మరింత పెంచాయి. ఇక వీటన్నిటినీ మరిచిపోయే దెబ్బకొట్టాడు నీరవ్‌ మోదీ. రూపాయి హామీ లేకుండా ఏకంగా 11,400 కోట్లను దేశం దాటించేసి తానూ పరారైన నీరవ్‌.. భారతీయ బ్యాంకుల ఆయువుపట్టుపై కొట్టాడు. ఆ దెబ్బ జనం విశ్వాసానికి రాసిన మరణ శాసనమే! నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. వీటి నుంచి మన బ్యాంకులు తేరుకోవటం అంత తేలికేంకాదు!!
 
నిపుణుల హెచ్చరికలు పక్కనపెడదాం! మనకు తక్షణం ఎదురవుతున్న ప్రమాదమేంటి? ఇంకేముంది. మళ్లీ పెద్ద నోట్ల రద్దునాటి పరిస్థితే. అప్పట్లోనైతే కొత్త నోట్లు లేవు. కాబట్టి ఏటీఎంల్లో, బ్యాంకుల్లో కటకట. మరి 15 నెలల తర్వాత.. అదికూడా వేల కోట్ల నగదును ముద్రించి పంపించాక కూడా ఎందుకిలా? ఎందుకంటే వరస పరిణామాలతో బెంబేలెత్తుతున్న జనం.. బ్యాంకుల్లో డిపాజిట్లను తగ్గించేశారు.

కొందరు మానేశారు. వేతన జీవులు జీతం పడితే రెండ్రోజుల్లోనే ఖాళీ చేసేస్తున్నారు. చేతికందిన నోట్లను ఇళ్లలో ఉంచుకుంటున్నారు తప్ప వడ్డీకి ఆశపడి బ్యాంకుల్లో వేయటం లేదు. నగదు దందాలు మరింత పెరిగిపోయాయి. ఖాతాదారులు బ్రాంచీకి వచ్చి విత్‌డ్రా చేసినా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నాయి పలు బ్యాంకులు. మున్ముందు డిపాజిట్ల పరిస్థితి ఇలాగే సాగితే..? అమ్మో!! ఆ సంక్షోభాన్ని ఊహించలేం!!

తగ్గిన డిపాజిట్లు.. పెరిగిన విత్‌డ్రాలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరతతో మూతపడ్డ ఏటీఎంలలో 25 శాతం ఇప్పటికీ తెరుచుకోలేదు. నిజానికి గతేడాది మే తర్వాత పరిస్థితులు చాలావరకూ సద్దుమణిగాయి. మళ్లీ నగదు వ్యవస్థ కళకళలాడింది. కాకపోతే ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు రానుందని వచ్చిన కథనాలు ఖాతాదారుల్లో వణుకు పుట్టించాయి.

ఈ బిల్లుతో డిపాజిట్లకు గ్యారంటీ ఉండదని, బ్యాంకులు తమ ఇష్టానుసారం డిపాజిట్లను ఉంచేసుకుంటాయని కథనాలొచ్చాయి. దీనికితోడు 2 లక్షలకన్నా ఎక్కువ డిపాజిట్‌ చేసినవారికి ఐటీ నోటీసులు. వీటన్నింటినీ మించి నీరవ్‌ మోదీ దెబ్బ! ఈ పరిణామాలన్నీ బ్యాంకులపై జనానికి ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో కొత్త డిపాజిట్లు తగ్గాయి. అదే సమయంలో నగదు విత్‌డ్రాలు పెరిగాయి.

బ్యాంకుల్లో దాచుకున్న ఎఫ్‌డీలతోపాటు జన్‌ధన్‌ ఖాతాలనూ రద్దు చేసుకొని నగదు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ దెబ్బకు బ్యాంకులలో గల్లా పెట్టెలు ఖాళీ అయ్యాయి. ‘‘బ్యాంకింగ్‌ వ్యాపారం, ఆదాయంలో 70 శాతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లదే. దీన్ని కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు కొందరు కార్పొరేట్లు పథకం వేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని 60 శాతం బ్యాంకుల్లో డబ్బుల్లేవు’’అని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ నేషనల్‌ అడ్వైజర్‌ హర్షవర్ధన్‌ మాడభూషి చెప్పారు.

సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందని ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. సేవింగ్స్‌ ఖాతాల నుంచి ఒక్కసారిగా సొమ్ము విత్‌డ్రా అవుతుండటమే నగదు కొరతకు ప్రధాన కారణమని మరో అధికారి చెప్పారు. ‘‘గతంలో సేవింగ్స్‌ ఖాతాలో వేతనం పడ్డాక నాలుగైదు రోజుల వరకూ ఖాతాల్లో సగానికి పైగా డబ్బుండేది. కానీ పెద్దనోట్ల రద్దు తర్వాత అకౌంట్‌లో జీతం పడిన 10 గంటల్లోపు డ్రా చేసేస్తున్నారు’’అని ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ ఒకరు వ్యాఖ్యానించారు.

పరిస్థితి మారిందిలా..
నిజానికి దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎప్పుడూ రుణాలకన్నా డిపాజిట్లు దాదాపు 40 లక్షల కోట్ల మేర అధికంగా ఉంటాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం డిసెంబర్‌ నాటికి డిపాజిట్లు రూ.125 లక్షల కోట్లు కాగా మొత్తం రుణాలు రూ.85 లక్షల కోట్లు. కానీ తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారింది. అందువల్లే ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 6,552, తెలంగాణలో 4,875 బ్యాంక్‌ బ్రాంచీలున్నాయి. వీటిల్లో 8 కోట్ల ఖాతాలున్నాయి.

ఇక్కడ రూ.లక్ష కోట్ల వరకు డిపాజిట్లుంటే.. రూ.90 వేల కోట్ల వరకు రుణాలుంటాయి’’అని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌.వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ‘‘డిపాజిట్ల కంటే విత్‌డ్రాలు పెరిగాయి. దీంతో అనధికారికంగా నగదు ఉపసంహరణలపై నియంత్రణ పెట్టాం. రోజుకు గ్రామాల్లో రూ.5 వేలు, పట్టణాల్లో రూ.10–30 వేలకు మించి ఇవ్వటం లేదు’’అని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు.  

బ్యాంక్‌లకు రాని రూ.2 వేల నోట్లు
సాధారణంగా జాతీయ బ్యాంక్‌కు రోజుకు రూ.60 లక్షల నగదు కావాలి. ఇందులో రూ.30 లక్షలు బ్యాంకులో పంపిణీకి, 20 లక్షలు ఏటీఏంలో పంపిణీకి, రూ.10 లక్షలు రిజర్వ్‌గా ఉపయోగపడతాయి. కానీ గత ఆరేడు నెలలుగా వచ్చే నగదు రూ.20 లక్షలకు మించట్లేదని ఓ సీనియర్‌ బ్యాంక్‌ అధికారి చెప్పారు. ‘‘ఆరేడు నెలలుగా బ్యాంకుల్లో రూ.2 వేల నోట్ల డిపాజిట్లు పూర్తిగా తగ్గిపోయాయి. సగటున బ్యాంక్‌ బ్రాంచీకి రోజూ రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు వస్తాయి. కానీ రెండు నెలలుగా ఇవి 4 లక్షలకు పడిపోయాయి. జనం తమ వద్దకు వచ్చిన రూ.2 వేలు, రూ.500 నోట్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు’’అని ఆయన చెప్పారు.

గత ఆరేడు నెలలుగా జన్‌ధన్‌ ఖాతాల్లోని సొమ్మును కూడా ఖాతాదారులు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. జీరో సొమ్ముతో జన్‌ధన్‌ ఖాతాలు ఆరంభమైనా.. తర్వాత వీటిల్లో కనీసం రూ.100 ఉంచాలన్న నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది ఖాతాలు మూసేశారు. ఖాళీ ఖాతాలను నిర్వహించడం, పర్యవేక్షించడం భారంగా మారుతుండటంతో 40 శాతం ఖాతాల్ని తొలగించే పనిలో ఉన్నామని మరో బ్యాంకు అధికారి చెప్పారు.

ఏటీఎంలను చూస్తే తెలియదా?
దేశవ్యాప్తంగా 17 లక్షల ఏటీఎంలు ఉంటే.. నగదు కొరత కారణంగా అందులో దాదాపు 60 శాతం పనిచేయటం లేదు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 2.07 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. ఇక్కడా అదే పరిస్థితి ఉందని, పట్టణ–గ్రామీణ ప్రాంతాల్లోనైతే 80 శాతం వరకూ ఏటీఎంలు పడకేశాయని ఏటీఎం సెక్యూరిటీ గార్డు ప్రతినిధుల సంఘం పేర్కొంది.

లక్ష కోసం మూడ్రోజుల ప్రదక్షిణ
విజయవాడలోని ఆంధ్రాబ్యాంకు బ్రాంచీకి రెండ్రోజుల కిందట ఓ ఖాతాదారు వెళ్లి తన డిపాజిట్‌ను ఉపసంహరించుకున్నాడు. లక్ష రూపాయల నగదు అడిగాడు. వారు ఆ డబ్బులివ్వటానికి మర్నాడు రమ్మన్నారు. నగదు లేదని మూడురోజులుగా తిప్పుతున్నారు తప్ప తన పని కాలేదని సదరు వ్యక్తి వాపోయాడు. ఇక శ్రీకాకుళంలో ఓ విద్యార్థిని కాలేజీ ఫీజుకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవటానికి ఎస్‌బీఐకి వెళ్తే.. వారు 15 వేలు కావాల్సిన చోట 5 వేలిస్తామని, 8 వేలిస్తామని బేరం పెట్టారు.

చివరకు ఆమె నాలుగు గంటలపాటు అదే పనిగా కూర్చుని తన అవసరాన్ని చెప్పటంతో డిపాజిట్లు వచ్చేదాకా చూసి సాయంత్రానికిచ్చారు. ‘‘గత 3 నెలలుగా గుంటూరు జిల్లాలో జాతీయ బ్యాంక్‌ల నుంచి ఏకంగా రూ.2,800 కోట్లు విత్‌డ్రా చేశారు. వరంగల్‌లో గడిచిన 10 రోజుల్లో రూ.9 కోట్ల నగదు విత్‌డ్రా చేసుకున్నారు. డిపాజిట్లు అందులో సగం కూడా లేవు’’అని ఓ బ్యాంకు అసోసియేషన్‌ అధ్యక్షుడు వివరించారు.

దేశంలో మొత్తం బ్యాంకు శాఖలు: 1,35,946
సేవింగ్స్‌ ఖాతాలు: 38.8 కోట్లు
కరెంట్‌ ఖాతాలు: 2.83 కోట్లు
జన్‌ధన్‌ ఖాతాలు: 31.11 కోట్లు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top