వాహనం విక్రయిస్తున్నారా.. జాగ్రత్త సుమా! | Care Must Be Taken In Vehicle Sales | Sakshi
Sakshi News home page

వాహనం విక్రయిస్తున్నారా.. జాగ్రత్త సుమా!

Dec 14 2019 10:41 AM | Updated on Dec 14 2019 10:41 AM

Care Must Be Taken In Vehicle Sales - Sakshi

సెకండ్‌ హ్యాండ్‌ ద్విచక్ర వాహనాలు

పాతపట్నం, హిరమండలం: బైక్‌ వినియోగదారులు రోజురోజుకూ పెరుగుతున్నారు. కొత్త వాహనాలతో పాటు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల క్రయవిక్రయాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. అయితే బండి అమ్మేటప్పుడు గానీ, పాత బండి కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇతరులకు విక్రయించినట్లు సేల్‌ అగ్రిమెంట్‌ ఇతర పత్రాలన్నీ సరిగా చూసుకోకుంటే ఆ తర్వాత లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇటీవల పోలీసులు ఈ–చలానా విధిస్తుండటంతో కూడా చిక్కులు ఎదురవుతున్నాయి.  

పాత వాహనాన్ని అమ్మిన సమయంలో కేవలం చిన్న బాండ్‌ పేపర్‌తో విక్రయం గురించి ఒప్పందాలు చేసుకుని విక్రయిస్తారు. వాహనాన్ని కొన్న వ్యక్తి తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా అలాగే నడిపిస్తే అమ్మిన వ్యక్తి పేరున ఉన్న చలానాల భారం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో సేల్‌ డీడ్‌ అగ్రిమెంట్‌ కాగితాలు ఉండడం మంచిది. సరైన అవగాహన లేకపోవడంతో ఇలాంటి వ్యవహారా ల్లో చాలా మంది బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అమ్మిన వారితో పాటు కొన్నవారు కూడా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది.  

జోరుగా మారు బేరాలు 
నగరాలు, పట్టణాలతో పాటు ఇటీవల మండల స్థాయిలో కూడా వాహనాల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. మధ్యవర్తుల ఆధ్వర్యంలో ఇష్టం వచ్చినట్లు క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. జిల్లాలోని అన్ని రకాల వాహనాల్లో దాదాపు 20 శాతానికి పైగా వాహన యజమానులు గాక ఇతరులే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసిన వారు వారం, పది రోజుల్లోపు యాజమాన్య హక్కులను మార్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆలస్యం చేస్తే అధికారులు జరిమానాలు విధించే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. 

29, 30 ఫారాలే ముఖ్యం.. 
వాహనాలు కొన్న వెంటనే ఆర్సీ, ఇన్స్యూరెన్సు, కాలు ష్యం, చిరునా మా లాంటి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయించుకోవడం చాలా ముఖ్యమని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. వాటితో పాటు ఫారం 29 రెండు కాపీలు, ఫారం 30పై విక్రయించిన వారి సంతకాలు తీసుకుంటే యాజమాన్య హక్కుల బదిలీ సులభమవుతుంది. పాత వాహనం అమ్మేశాక యాజమాన్య హక్కులు బదిలీ చేసుకోకపోతే కష్టాలు తప్పవు. కొత్తగా మరో వాహనం కొంటే పన్నుల రూపంలో అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తుంది. సాధారణంగా ద్విచక్ర వాహనాలకు 9శాతం, కారుకు 12 శాతం జీవిత కాలం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రెండో వాహనం కొనుగోలు చేసినప్పుడు ద్విచక్రవాహనానికి 14 శాతం, కారుకు 14 శాతం చెల్లించాలి. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో పలువురు ఎక్కువ పన్నులు చెల్లిస్తూనే ఉన్నారు. వాహనాన్ని అమ్మిన వెంటనే ఇరువైపుల యాజమాన్య హక్కులను స్పష్టంగా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

మారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి..
పాత వాహనాలు కొన్న వెంటనే ఆర్సీ, ఇన్సూ్యరెన్సు, కాలుష్యం, చిరునామా లాంటి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయించుకుని పేరు, చిరునామా మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. తప్పనిసరిగా కోనుగోలు దారుడు చూసుకోవాలి. 
–కే.వి.ప్రకాశరావు, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ , పలాస 

పత్రాలు లేకుంటే కొనవద్దు.. 
సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు సరైన పత్రాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ట్రాఫిక్‌ చలానాలు లేకుండా ఉండే వాహనాలను కోనుగోలు చేసుకోవాలి. సరైన పత్రాలు లేకుంటే కేసులు నమోదవుతాయి. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి.  
– రొక్కం రవిప్రసాద్, సీఐ, పాతపట్నం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement