‘సీఎం ఆశయాలతో ముందుకు సాగాలి’

Botsa Satyanarayana Speech In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: పూజ్య బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలో ఎవరూ ఆచరణలో పెట్టకపోయినా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణలో పెట్టి చూపించారని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఇంటి ముంగిటకి ‘నవరత్నాలు’ తీసుకువెళ్లేందుకు సీఎం జగన్‌ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. గతంలో ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు లభించాలంటే అదొక కలగా ఉండేదని.. కానీ నేడు వాటికి భిన్నంగా దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష 30వేలు ఉద్యోగాలు ఇవ్వడం శుభపరిణామంటూ వ్యాఖ్యానించారు. యువత వారి కాళ్ల మీద నిలబడేలా నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగులు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతోందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు తలెత్తుకొని తిరిగేలా తమ ప్రభుత్వం ఉద్యోగాలకు పెద్దపీట వేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవినీతి రహిత పాలన అందించేందుకు సీఎం జగన్‌ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు.

కాగా, ప్రభుత్వ ఆశయాలకి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని, రాష్ట్రంలో కొన్ని దుష్టశక్తులు ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నాయని తెలిపారు. ఆ కుట్రలో సచివాలయ ఉద్యోగులు బలికాకుండా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వివరించారు. అన్ని విభాగాల్లో నిష్ణాతులైన వారు సచివాలయ ఉద్యోగాలను పొందారని చెప్పారు. ఎంపికైన ఉద్యోగులు వారి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత కలిగి ఉండాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎక్కడా ఇంత పారదర్శకమైన ఉద్యోగ నియామకాలు జరిగిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలతో ముందుకు సాగుతూ.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని పల్లెల్లోకి తీసుకువెళ్లే బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. సీఎం పట్టుదలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top