బ్లాంకెట్‌ బాదుడు

Blanket Charges in Garib Rath Train Visakhapatnam - Sakshi

ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.25 వసూలు

చార్జీల వడ్డనతో కలిపి రూ.55 భారం

రైల్వే బోర్డు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం

కొత్త సంవత్సరం కానుకగా ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపిన రైల్వే బోర్డు.. ఇప్పుడు మరో నిర్ణయంతో నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. సామాన్యులకు ఏసీ ప్రయాణ సౌకర్యం అందించేందుకు ప్రారంభించిన గరీబ్‌రథ్‌ రైళ్లలో అదనపు సర్‌ చార్జీలు వసూళ్లు చేసేందుకు సిద్ధమైంది. గరీబ్‌రథ్‌ ఎక్కిన ప్రయాణికులు దిండు, బ్లాంకెట్‌ కావాలంటే రూ.25 రుసుం చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వరకు గరీబ్‌రథ్‌లో వెళ్లే ప్రయాణికులపై చార్జీల వడ్డన కారణంగా రూ.30 అదనపు భారం పడుతుండగా.. ఇప్పుడు మరో రూ.25 బాదుడుతోప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రైల్వే శాఖ ప్రయాణికులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. జనవరి ఒకటి నుంచి రైలు చార్జీలు పెంచి ప్రయాణికుల పై భారం మోపిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో భారం మోపుతూ రైల్వే శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ప్రయాణికుల పుండుపై కారం చల్లినట్లుగా మారింది. గరీబ్‌రథ్‌ రైళ్లలో ప్రయాణించే వారు ఇకపై దిండు, బ్లాంకెట్‌ కోసం ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు అమల్లోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా గరీబ్‌ రథ్‌ రైళ్లను 2005లో ప్రవేశపెట్టారు. గరీబ్‌రథ్‌ అంటే పేదల రథం. అతి తక్కువ ధరకే పేదలకు ఏసీ కోచ్‌లు అందించాలనే లక్ష్యంతో ఈ సేవలు మొదలయ్యాయి. ఇతర రైళ్ల ఏసీ ప్రయాణం కంటే ఇందులో 2/3 వంతు ఛార్జీ వసులు చేస్తారు. ఈ నెల ఒకటి నుంచి చార్జీలు పెంపుతో అదనపు భారం పడింది. దీనికి తోడు ఏసీ ప్రయాణికులకు అందించే దుప్పట్లపైనా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు.

రూ.500తో ప్రారంభమై..: గరీబ్‌రథ్‌ పేరుతో మొదలైన సేవలు అనుకున్నట్లుగానే సామాన్యుడికి అందుబాటులోనే టికెట్‌ ధరలుండేవి. గరీబ్‌ రథ్‌ని ప్రారంభించిన సమయంలో టికెట్‌ ధర కేవలం రూ.500 మాత్రమే ఉండేది. తరువాత రూ.715 వరకు పెంచుకొచ్చారు. జనవరి ఒకటి నుంచి అమలైన ధరలతో టికెట్‌పై ఏకంగా రూ.30 భారం పడింది. ఈ భారమే ఎక్కువైందని సామాన్యులు భావిస్తున్న నేపథ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణయం మరింత భారం మోపింది

మొత్తంగా రూ.55 భారం : ఇకపై రిజర్వేషన్‌ చార్జీతో పాటు ఏసీ ప్రయాణికులకు అందించే బ్లాంకెట్‌ కోసం అదనంగా రూ.25 వసూలు చెయ్యనున్నారు. ఈ కొత్త ధర మే 15 నుంచి అమల్లోకి తీసుకురావాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. టికెట్‌ బుక్‌ చేసినప్పుడే ఈ చార్జీలను అందులోనే కలిపెయ్యాలని నిర్ణయించారు. అంటే ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.745తో పాటు రూ.25 కలిపి మొత్తం టికెట్‌ ధర రూ.770గా మారనుంది. అంటే గరీబ్‌రథ్‌లో ప్రయాణం చెయ్యాలనుకునే సగటు ప్రయాణికుడిపై రూ.55 అదనపు భారం(పెరిగిన టికెట్‌ చార్జీ రూ.30, బ్లాంకెట్‌ చార్జీ రూ.25) పడనుంది. రైల్వే బోర్డు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఎవరి కోసం గరీబ్‌రథ్‌.?
సామాన్య ప్రయాణికుల కోసం గరీబ్‌రథ్‌ ప్రవేశపెట్టామన్నారు. కానీ ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ దిండ్లు, దుప్పట్లకి కూడా చార్జీలు వసూలు చెయ్యడం దారుణం. ఇలా ప్రయాణికులపై ఎప్పటికప్పుడు భారం పెంచేసి సాధారణ రైలు టికెట్‌లా వసూలు చేస్తే గరీబ్‌రథ్‌ ఎవరి కోసం ప్రవేశపెట్టారో రైల్వే అధికారులే చెప్పాలి.– బి.రవికుమార్, విశాఖ ప్రయాణికుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top