బీజేపీకి సమైక్య సెగ | bjp in trouble regards united andhra issue | Sakshi
Sakshi News home page

బీజేపీకి సమైక్య సెగ

Sep 16 2013 2:47 AM | Updated on Mar 29 2019 9:18 PM

పిఠాపురంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణకు అనుకూలంగా ఉన్న బీజేపీ సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని సమైక్యవాదులు అడ్డుకోవడంతో సమావేశం అర్థాంతరంగా ముగిసింది.


 పిఠాపురం, న్యూస్‌లైన్ :
 పిఠాపురంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణకు అనుకూలంగా ఉన్న బీజేపీ సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని సమైక్యవాదులు అడ్డుకోవడంతో సమావేశం అర్థాంతరంగా ముగిసింది. పిఠాపురంలోని శ్రీసీతారామాంజనేయ ఆశ్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వి.సూర్యనారాయణరాజు అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభించారు. సమావేశానికి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిమిరెడ్డి మాలకొండయ్య, జిల్లా అధ్యక్షుడు రాయుడు సూర్యప్రకాశరావు, మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీతులసి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రి మురళీధరరావు, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి చింతపల్లి పద్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గ సమైక్య జేఏసీ నాయకులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని సమావేశాన్ని అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేయాలని, నినాదాలు చేయాలని బీజేపీ నేతలను పట్టుబట్టారు.
 
  బీజేపీ నాయకులు అందుకు నిరాకరించి జైఆంధ్ర అంటూ నినాదాలు చేశారు. సమైక్య జేఏసీ నాయకులు, సమైక్యవాదులు దానిని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రతి నినాదాలు చేశారు. వేదిక పైకి దూసుకెళ్లి ఫర్నిచర్, బ్యానర్లు తొలగించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ నాయకుల వాహనాల టైర్లలో గాలిని సైతం తీసివేయడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేయకపోతే సమావేశం జరగనిచ్చేది లేదని సమైక్యవాదులు భీష్మించారు. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. బీజేపీ కార్యకర్తలు, సమైక్యవాదుల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి సమైక్యవాదులను బయటకు పంపించేశారు. బీజేపీ నాయకులు కూడా సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. బీజేపీ మద్దతు లేకుండా రాష్ట్ర విభజన జరగదని, సీమాంధ్రకు న్యాయం జరగకుండా విభజనను జరగనిచ్చేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వి.సూర్యనారాయణరాజు అన్నారు. సోని యా తన కుమారుడిని ప్రధాని చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర విభజనను తెరపైకి తెచ్చారని విమర్శించారు. సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, బీజేపీ శ్రేణులు ఇక్కడ ఇలా చెప్పడం విడ్డూరంగా ఉందని సమైక్యవాదులు విమర్శించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement