ఆ ఇద్దరూ నయవంచకులు..: భూమన | Bhumana Karunakar Reddy takes on Kiran kumar reddy, chandra babu | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరూ నయవంచకులు..: భూమన

Feb 20 2014 2:12 AM | Updated on Jul 29 2019 5:31 PM

ఆ ఇద్దరూ నయవంచకులు..: భూమన - Sakshi

ఆ ఇద్దరూ నయవంచకులు..: భూమన

ఇద్దరు నయవంచకులు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు చీడ పురుగుల మాదిరిగా తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.

 కిరణ్, చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు:  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన
చిత్తూరు జిల్లా వాసులను తలదించేకునేలా చేసిన చరిత్రహీనులు
సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చిన సోనియా తొత్తు కిరణ్

 
 సాక్షి, హైదరాబాద్: ఇద్దరు నయవంచకులు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు చీడ పురుగుల మాదిరిగా తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. వీరిద్ద రూ కలిసి చిత్తూరు జిల్లా వాసులను తలదించుకునేలా ప్రవర్తించి చరిత్రహీనులుగా మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 కాంగ్రెస్  కోర్‌కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలలో రాష్ట్ర విభజనకు గంగిరెద్దులా తలూపిన కిరణ్ ఆర్భాటపు మాటలతో ప్రజలను నిట్ట నిలువునా మోసగించారన్నారు. ఉద్యోగులు చేపట్టిన మహోగ్ర ఉద్యమాన్ని నీరుగార్చి విభజనకు అన్ని రకాలుగా రహదారులు వేసి సోనియా తొత్తులా వ్య వహరించారని దుయ్యబట్టారు. రాజకీయ సంక్షోభం సృష్టిద్దామని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెబుతుంటే పెడచెవిన పెట్టి, తమ నిజాయితీనే శంకిస్తూ కిరణ్ ఎదురు దాడికి దిగారని గుర్తుచేశారు.
 
 అడపాదడపా ప్రెస్‌మీట్లు పెట్టి నాలుగు మాటలు చెప్పేసి తన తాబేదార్లు, ఉద్యోగస్తుల నాయకుడి చేత ‘సమైక్య సింహం’ అనిపించుకున్నారే తప్పితే ఏనాడు కూడా రాష్ట్ర సమైక్యత కోసం కిరణ్ కృషి చేయలేదన్నారు. సమైక్య ముసుగులో కిరణ్ ఆరు నెలలుగా రెండు చేతులతో సంతకాలు చేస్తూ డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మరో నయవంచకుడైన చంద్రబాబు రాష్ట్రంలో ఇరు ప్రాంత నేతలను ఉసిగొల్పి రసవత్తరమైన నాటకంలో విదూషకుడిగా మిగిలారన్నారు. ఏ ఒక్కరోజూ సీమాంధ్రకు జరిగే నష్టాన్ని ప్రస్తావించకుండా కొబ్బరికాయల సిద్ధాం తంలో ప్రజలకు బాబు తీరని ద్రోహం తలపెట్టారన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన తర్వాతి రోజు ప్రెస్‌మీట్ పెట్టి సీమాంధ్రకు నాలుగైదు లక్షల కోట్లు కావాలంటూ ప్రజల మనోభావాలను తాకట్టుపెట్టారని బాబుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం మొదటి నుంచి చిత్తశుద్దితో పనిచేస్తున్నది వైఎస్సార్‌సీపీనే అని ఉద్ఘాటించారు. ఇప్పటికీ అదే ఆశతో సుప్రీంకు వెళ్లామన్నారు.
 
 బాబు లేఖలతోనే విభజన: ఉమ్మారెడ్డి, దాడి

 రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి పదేపదే గుర్తుచేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖలు రాయడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని  వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాడి వీరభద్రరావు మీడియాతో పేర్కొన్నారు. టీడీపీని ప్రజలు తిరస్కరించినా పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం కేంద్రాన్ని రెచ్చగొట్టే విధంగా ‘విభజన మీరు చేస్తారా? నన్ను చేయమంటారా? అసెంబ్లీలో మీరు తీర్మానం పెట్టకపోతే మేం పెడతాం’ అన్న చంద్రబాబు వ్యాఖ్యల వల్లే 2009 డిసెంబర్ 9న విభజన ప్రకటన వచ్చిందన్నారు. కేంద్రం వెనక్కి తగ్గిన తర్వాత అఖిలపక్షం అంటూ ప్రకటనలు చేసి రాష్ట్ర విచ్ఛిన్నానికి కారకుడయ్యారని బాబుపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీఎన్జీవోలు కోరితే.. ‘ఏం మనవారు బెంగళూరు, చెన్నై వెళ్లి బతకడం లేదా?’ అంటూ విభజనను సమర్థించేలా మాట్లాడారన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న జూలై 30నే కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, విపక్ష సభ్యులంతా రాజీనామా చేసి ఉంటే ఈ రోజు విభజన జరిగేదే కాదన్నారు. డిసెంబర్ 9న చిదంబరం టీ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పినప్పుడు మూకుమ్మడి రాజీనామాలు చేయటంతో విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు.
 
  కేంద్ర కేబినేట్ సమావేశాల్లో మౌనం దాల్చిన మంత్రులు ఇప్పుడు పార్లమెంటులో నిరసనల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారకులైన నిందితులలో ఎ-1 సోనియా, ఎ-2 చంద్రబాబు, ఎ-3 కిరణ్‌కుమార్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. సోనియాగాంధీ చెప్పినందు వల్లే గతంలో రాజీనామా చేయలేదని అంటున్న కిరణ్ ఇప్పుడు ఆమె పచ్చజెండా ఊపినందునే తప్పుకున్నారా? అని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement