కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు


విద్యానగర్ (గుంటూరు), న్యూస్‌లైన్ :పార్టీలో వలసలు ప్రారంభమవ్వడంతో బెంబేలెత్తిన కాంగ్రెస్ అధిష్టానం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం చుట్టుగుంట సెంటర్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు ఆజ్యం పోసిన కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ప్రజాసంక్షేమం కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని.. అందుకే తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేశారని చెప్పారు.

 

 పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాల వల్లే రాష్ట్రం రావణకాష్టంలా మారిందన్నారు. ఎందరో అమాయక ప్రజలు నష్టపోతున్నారని, వారి ఉసురు కాంగ్రెస్, టీడీపీలకు తప్పక తగులుతుందన్నారు. అనంతరం చుట్టుగుంట సెంటర్ నుంచి అరండల్‌పేట వరకు నగర విద్యార్థి విభాగం కన్వీనర్ పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో బైకుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

 

 కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు నసీర్‌అహ్మద్, షేక్ షౌకత్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్, బోడపాటి కిషోర్, విజయ్‌కిషోర్, చాంద్‌బాషా, మద్దుల రాజాయాదవ్, సురగాని శ్రీను, మేళం ఆనందభాస్కర్, ప్రేమ్‌కుమార్, సుబ్బారెడ్డి, అందుగుల రమేష్, శివారెడ్డి, గౌస్‌కుమార్, దేవరాజు, శ్రీకాంత్, హేమంత్‌గుప్తా, మార్కొండారెడ్డి, వినోదజమీర్, పునీల్, ఝాన్సీ, వనజాక్షి, రాజేష్, విఠల్, శ్యాం, వసంత్, అశోక్, ఫణీంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top