టీడీపీ ప్లాన్‌.. పోలీసులపై యాక్షన్‌

AP Police Reveals TDP Plan in Macherla Conflicts Guntur - Sakshi

స్థానికులను రెచ్చగొట్టి.. ఆపై వారి దాడిని కెమెరాలో చిత్రీకరించి

కనీసం పోలీసులకు ఫోన్‌ కూడా చేయని వైనం

తమకు రక్షణ కల్పించడంలో విఫలమంటూ పోలీసుశాఖపై అభాండం

తనకు సమాచారం లేదంటున్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి  

ఈ ఘటనలో ఎస్పీ, సీఐపై చర్యలకు ఈసీ సిఫార్సు

సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి కింది స్థాయి క్యాడర్‌ కూడా వెనుకడుగు వేసింది. బరిలో నిలవడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. దీంతో పరువు పోతుందని భావించిన టీడీపీ నాయకులు కొత్త ఎత్తుగడ వేశారు. ప్రశాంతగా వాతావరణాన్ని రణరంగంగా మర్చే ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా వెల్దుర్తి మండలం బోదలవీడులో తమ పార్టీ కార్యకర్తలను నామినేషన్‌లు వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు సాకుతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను చంద్రబాబు మాచర్లకు పంపారు. ఓ పథకం ప్రకారం టీడీపీ నాయకులు గత బుధవారం మాచర్లకు వెళ్లారు. అక్కడి ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో స్థానికులు ఆగ్రహానికి గురై ఆవేశంలో టీడీపీ నాయకుల కారుపై దాడి చేయడాన్ని ఆ పార్టీ నాయకులే వ్యూహం ప్రకారం వీడియోలు చిత్రీకరించారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పథకం ప్రకారం తమపై దాడి చేశాయని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించడంతో పోలీసుల వైఫల్యం ఉందని కలరింగ్‌ ఇచ్చారు. సీన్‌ కట్‌ చేస్తే మాచర్ల ఘటనపై రూరల్‌ ఎస్పీ, మాచర్ల టౌన్‌ సీఐలపై చర్యలకు ఈసీ సిఫార్సు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఎన్నికల ప్రక్రియను భంగం కలిగించాలని టీడీపీ పన్నిన కుట్రలో పోలీసులు బలయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. 

పక్కా ప్లాన్‌తో..
పథకం ప్రకారం టీడీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి ఏ చిన్న ఘటనలు చోటు చేసుకున్నా వీడియోలు ఫొటోలు చిత్రీకరించేలా వ్యూహాలు రచించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకుల రెచ్చగొట్టే చర్యలకు ఆవేశంతో స్థానికులు దాడి చేయడానికి బుద్దా, బొండా ఉమాల కారును వెంబడిస్తుంటే వారి వెనుక కారులో ప్రయాణిస్తున్న వారు వీడియోలు చిత్రీకరించారే తప్ప పోలీసులకు ఫోన్‌ కూడా చేయలేదు. సాధారణంగా అపాయం, ప్రాణాపాయ సమయంలో ఎవరైనా వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి రక్షించాలని కోరతారు. అయితే మాచర్ల ఘటనలో టీడీపీ నాయకులు అలాంటి ఆలోచననే చేయలేదు.

సున్నిత ప్రాంతం అని తెలిసి కూడా..
పల్నాడు ప్రాంతం అతిసున్నితమైనదని మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుసు.  అయినా గుంటూరు జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నాయకులను కాదని కృష్ణా జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను మాచర్లకు పంపడం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని విమర్శలొస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు ఏదైనా నియోజకవర్గంలోకి వెళ్లే ముందు ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు సమాచారం ఇస్తారు. అయితే టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బొండా ఉమ మాచర్లకు వస్తున్న విషయం తనకు తెలియదని ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి చలమారెడ్డి పోలీసు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు పోలీసులకు సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పల్నాడు ప్రాంతానికి వెళ్లి కుట్ర పూరితంగా వ్యవహరించిన టీడీపీ నాయకులు పోలీసుల వైఫల్యం వల్లే తమపై దాడి జరిగిందని విమర్శిస్తున్నారు. టీడీపీ నుంచి అభ్యర్థులు నామినేషన్‌లు వేయకుండా పోలీసులే బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ వ్యవస్థపై టీడీపీ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోందని పోలీస్‌ శాఖ సీనియర్‌ అధికారులు మండిపడుతున్నారు. టీడీపీ పన్నిన కుట్రల్లో పోలీసులు బలవుతున్నారని పోలీస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top