
ఏపీలో ‘ఇన్‌చార్జి’ పోలీసింగ్!
విభజన చట్టం అమలుల్లోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటికీ క్యాడర్ కేటాయింపు పూర్తికాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం ఇన్‌చార్జిల పాలనలో నడుస్తోంది.
కీలక పోస్టులకు అధికారులు కరువు
ఏడీజీ నుంచి డీఐజీ స్థాయి వరకు ఇదే తీరు
ఇన్‌చార్జి బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికారులు
క్యాడర్ అలాట్‌మెంట్ తరువాతే సమస్యకు పరిష్కారం
హైదరాబాద్: విభజన చట్టం అమలుల్లోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటికీ క్యాడర్ కేటాయింపు పూర్తికాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం ఇన్‌చార్జిల పాలనలో నడుస్తోంది. అదనపు డీజీ నుంచి డీఐజీ స్థాయి వరకు అనేక కీలక పోస్టుల్ని ఇన్‌చార్జిలే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 258 ఐపీఎస్ అధీకృత పోస్టులు ఉండగా... 206 మంది అధికారులు అందుబాటులో ఉండేవారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 144 పోస్టులను మే నెలలోనే కేంద్రం మంజూరు చేసింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన జూన్ 2 నాటికి కేటాయింపులు పూర్తిగా జరక్కపోవడంతో తాత్కాలిక ప్రాతిపదికన (ప్రొవిజనల్ అలాట్‌మెంట్) రాష్ట్రానికి ఆరుగురు డీజీపీ స్థాయి అధికారులు, 17 మంది అదనపు డీజీ స్థాయి అధికారులు, 11 మంది ఐజీ స్థాయి అధికారులు, 18 మంది డీఐజీ స్థాయి అధికారుల్ని కేటాయించారు.ఆంధ్రప్రదేశ్‌లో అదనపు డీజీ స్థాయిలో 25 పోస్టులు ఉండగా ఏడింటికి, ఐజీ స్థాయిలో 16 పోస్టులు ఉండగా ఆరింటికి, డీఐజీ స్థాయిలో 21 పోస్టులు ఉండగా రెండింటికి ఇన్‌చార్జీలే దిక్కయ్యారు. ఒక్కో అధికారి నాలుగు విభాగాలనూ పర్యవేక్షించాల్సి వస్తోంది. అనేక మంది అధికారులు తాము పని చేస్తున్న స్థానంతో పాటు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోస్టుకూ సరైన న్యాయం చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
టాస్ వేసి కేటాయింపు..
శనివారం నాటికి కేంద్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని రెండు రాష్ట్రాలకూ పంచుతుందని తెలుస్తోంది. నిర్దేశించిన దానికంటే ఎక్కువగా ఉన్న స్థానికులతో పాటు రాష్ర్టేతర అధికారుల్నీ రోస్టర్ పద్ధతిలో కేటాయిస్తారు. తొలి కేటాయింపును టాస్ వేయడం ద్వారా నిర్ధారిస్తారు. దీంతో అనేక మంది స్థానిక, రాష్ర్టేతర అధికారుల్లో తాము ఏ రాష్ట్రానికి వెళ్తామో అనే ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు శాంతిభద్రతల విభాగం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు దళం(ఏపీఎస్పీ), న్యాయ విభాగం తదితర కీలక పోస్టుల్లో రాష్ర్టేతర అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరు ఏ రాష్ట్రానికి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది.