క్వారంటైన్‌.. భేష్‌

AP Govt Services to an average of 10 thousand people per day in quarantine centres - Sakshi

రాష్ట్రంలోని కేంద్రాలకు విదేశీయుల నుంచీ అభినందనలు 

సగటున రోజూ 10 వేల మందికి సేవలు 

నిత్యం ఆహారం కోసం రూ.50 లక్షలు వ్యయం 

ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులందరికీ ఇక్కడే సేవలు 

పౌష్టికాహారం అందేలా కలెక్టర్ల నిరంతర పర్యవేక్షణ 

ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న మంత్రులు  

ఏప్రిల్‌ 20న మా ఇంటిపక్క వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో నన్ను కడపలోని క్వారంటైన్‌ కేంద్రానికి తీసుకెళ్లారు.14 రోజులు అక్కడే ఉన్నా. సమయానికి ఆహారం, కాఫీ, టీ లాంటివి క్రమం తప్పకుండా ఇచ్చేవారు. ఆహారం ఎలా ఉందో తెలుసుకునేందుకు నిత్యం పర్యవేక్షణ ఉండేది. పారిశుధ్య నిర్వహణ కూడా చాలా బాగుంది’... క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, సేవల గురించి వైఎస్సార్‌ జిల్లా కమలాపురానికి చెందిన కౌలూరి సునీల్‌ కుమార్‌రెడ్డి అనుభవం ఇది. ఆయన ఒక్కరే కాదు.. క్వారంటైన్‌ కేంద్రాల్లో గడిపిన ఎంతోమంది ఇదే మాట చెబుతున్నారు. వీరిలో విదేశీయులు సైతం ఉండటం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కోవిడ్‌ అనుమానితులకు కల్పిస్తున్న సేవలు ఎంతో బాగున్నాయని, పౌష్టికాహారాన్ని అందించారని, వైద్య సిబ్బంది ఆప్యాయంగా ఆదరించారని గుర్తు చేసుకుంటున్నారు. 

పాజిటివ్‌ కేసులు పెరిగినా సేవల్లో లోటు రానివ్వట్లేదు
గతంతో పోలిస్తే పాజిటివ్‌ పేషెంట్లు పెరిగారు. దీనివల్ల ప్రైమరీ కాంటాక్టుల సంఖ్యా పెరిగింది. సగటున 10 వేల మంది క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్నారు. చికిత్స పొందేవారి సంఖ్య భారీగా పెరిగినా నాణ్యమైన ఆహారం, వైద్య సేవలు అందించాలని ఆదేశించాం. దీనిపై నిత్యం పర్యవేక్షిస్తున్నాం.
–డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ

వేల సంఖ్యలో వస్తున్నా.... 
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లతో పాటు క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. వందల్లో కాదు వేలలో వస్తున్న బాధితులకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం, మెరుగైన వైద్య సేవలు, మందులు ఇచ్చి వైరస్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించారని పేర్కొంటున్నారు.  
► గత నెల రోజులుగా క్వారంటైన్‌లలో సగటున రోజూ 10 వేల మందికి సేవలు అందుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్నాటక లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో క్వారంటైన్‌ వ్యవస్థ చాలా బాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
► కరోనా విస్తరించిన తరుణంలో వైరస్‌ కట్టడిలో క్వారం టైన్‌ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను క్వారంటైన్‌లో ఉంచడం, వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా అరికట్టడం వీటి ప్రధానం లక్ష్యం.  

ఆహార నాణ్యతలో రాజీలేకుండా... 
► క్వారంటైన్‌ కేంద్రాల్లో రోజూ సగటున 10 వేల మందికి నాణ్యమైన మెనూతో ఆహారం అందిస్తున్నారు. ఒక్కొక్కరి ఆహారం కోసం రూ.500 చొప్పున వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు రూ.50 లక్షలు క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వారి ఆహారానికి  వ్యయమవుతోంది. (కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, కోవిడ్‌ ఆçస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారి ఆహారానికి రోజుకు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ఖర్చు చేస్తున్నారు). క్వారంటైన్‌లో ఉన్నవారికి పౌష్టికాహారం అందేలా జిల్లా కలెక్టర్లు  నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 

సోమవారం 
ఉదయం టిఫిన్‌: పూరి/చపాతీ, ఆలూ బటానీ కర్రీ,  
మధ్యాహ్నం: అన్నం/రోటీ/చపాతీ, వెజిటబుల్‌ కర్రీ, సాంబార్‌/రసం/పెరుగు/పళ్లు,  
రాత్రి: అన్నం లేదా చపాతీ

మంగళవారం 
టిఫిన్‌: ఇడ్లీ/వడ, చట్నీ, సాంబార్‌ 
మధ్యాహ్నం: అన్నం/చపాతీ/పుల్కా, వెజిటబుల్‌ కర్రీ, ఆకుకూర పప్పు. 
రాత్రి భోజనం: రోటీ/చపాతీ, ఉడకపెట్టిన గుడ్డు, ఆకుకూర 

బుధవారం 
టిఫిన్‌: ఉప్మా/వడ, సాంబార్, చట్నీ. 
మధ్యాహ్నం: అన్నం, చపాతీతోపాటు చికెన్‌ కర్రీ, వెజిటబుల్‌ కర్రీ, పెరుగు, పళ్లు. 
రాత్రి: రోటీ, చపాతీ, గుడ్డు, వెజిటబుల్‌ కర్రీ, రసం 

గురువారం 
టిఫిన్‌: ఉప్మా/ఊతప్పం, చట్నీ, సాంబార్‌. 
మధ్యాహ్నం: అన్నం/చపాతీ, వెజిటబుల్‌ 
కర్రీ, పప్పు.  
రాత్రి: అన్నం, చపాతీ, గుడ్డు, ఆకుకూర, సాంబార్‌. 

శుక్రవారం 
టిఫిన్‌: కిచిడీ/చపాతి, ఆలూ బటానీ కర్రీ.  
మధ్యాహ్నం: అన్నం/చపాతీ,పప్పు, ఆకుకూర, సాంబార్, రసం.  
రాత్రి: అన్నం/చపాతీ, పుల్కా, గుడ్డు, ఆకుకూర, వెజిటబుల్‌ కర్రీ, పళ్లు 

శనివారం 
టిఫిన్‌: పులిహోర. 
మధ్యాహ్నం: అన్నం/చపాతీ, వెజిటబుల్‌ కర్రీ, పప్పు, సాంబార్, రసం, పళ్లు.  
రాత్రి: రోటి/చపాతి, అన్నం, గుడ్డు, సాంబార్, రసం 

ఆదివారం
టిఫిన్‌: టొమాటో బాత్‌/పొంగల్, చట్నీ.  
మధ్యాహ్నం: రైస్‌/చపాతీ/రోటీ, చికెన్‌ కర్రీ, వెజిటుబల్‌ కర్రీ, సాంబార్, రసం.  
రాత్రి: రోటి/చపాతీ/రైస్, వెజిటబుల్‌ కర్రీ, గుడ్డు, సాంబార్, రసం, పెరుగు, పళ్లు. 

ఆకస్మిక తనిఖీలు.. 
క్వారంటైన్‌ కేంద్రాలపై ఎక్కడైనా ఆరోపణలు వస్తే నేరుగా మంత్రులే రంగంలోకి దిగి తనిఖీ చేస్తున్నారు. 
► వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్వయంగా విజయవాడలో, 
► ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి తిరుపతిలో ఆకస్మిక తనిఖీ చేశారు.

ప్రభుత్వ చొరవతో కోలుకున్నా
నాకు కరోనా లక్షణాలుండడంతో నెల్లూరు క్వారం టైన్‌ కేంద్రానికి తరలించి 20 రోజుల పాటు చికిత్స అందించారు. ఆరోగ్యంగా బయటకు వచ్చా. కరోనా బాధితుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ, చర్యలు, సేవలు అభినందనీయం. ప్రభుత్వ ముందస్తు చర్యల కారణంగా చాలా మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. 
– ఎస్కే రుబియా, నవాబుపేట, వాకాడు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top