జ్వర పీడితులను దాచేయండి

AP Govt Hiding Dengue Cases in State - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జ్వరాలతో అల్లాడుతున్న బాధితుల వివరాల నమోదులో గోల్‌మాల్‌ జరుగుతోంది. ప్రతి జిల్లాలో డెంగీ జ్వరాలు, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాటిలో కనీసం 5 శాతం కూడా రికార్డుల్లో నమోదు చేయడం లేదు. జ్వరాల కేసులను ఎక్కువగా నమోదు చేస్తే సస్పెండ్‌ చేస్తామంటూ ప్రభుత్వం నుంచి ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో 30 కేసులు నమోదైతే కేవలం ఒకటి లేదా రెండు కేసులను మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు వంటి ప్రాంతాల్లో బాధితుల నమోదులో అవకతవకలు జరుగుతున్నట్టు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. జ్వరాల తీవ్రత అధికంగా ఉన్నట్లు తేలితే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావని ప్రభుత్వం భయపడుతోందని, అందుకే బాధితుల వివరాలను నమోదు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నగర పరిధిలో గడిచిన 10 నెలల్లో 922 డెంగీ కేసులు వెలుగుచూడగా, కేవలం 43 కేసులనే ప్రభుత్వ రికార్డుల్లో చూపడం గమనార్హం.

ఎంఎఫ్‌–7 రికార్డులేవీ?
మలేరియా లేదా డెంగీ కేసులను ఎంఎఫ్‌–7(మలేరియా ఫ్యాక్ట్‌–7) రిజిస్టర్‌లో నమోదు చేశారు. ఇందులో బాధితుల పేర్లు, చిరునామా ఉంటాయి. కానీ, కొన్నినెలలుగా ఈ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తెల్లకాగితంపై వివరాలు రాసి, ఉన్నతాధికారులకు పంపిస్తే వాళ్లు ఒకటో రెండో కేసులను ఎంఎఫ్‌–7 రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. అంతిమంగా ఈ వివరాలే అధికారికంగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో, ముఖ్యమంత్రి కోర్‌డ్యాష్‌ బోర్డులో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తన పరువు కాపాడుకోవడానికే జ్వర పీడితుల వివరాలను దాచేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఎస్‌ఎస్‌హెచ్‌ ల్యాబొరేటరీల్లో అసలు నిజాలు
ప్రతి జిల్లాలో డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ కేసుల నిర్ధారణకు సివిలిటేనియస్‌ శాంపుల్‌ అండ్‌ హోల్డ్‌(ఎస్‌ఎస్‌హెచ్‌) ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్‌ వచ్చిన ప్రతి కేసునూ బాధితుడి పేరు, చిరునామాతో సహా నమోదు చేస్తారు. కొన్ని జిల్లాల్లో ఎస్‌ఎస్‌హెచ్‌ ల్యాబ్‌ల్లో ‘సాక్షి’ పరిశీలించగా.. వాస్తవ జ్వరాల కేసులకు, ప్రభుత్వం వెల్లడించిన బాధితుల గణాంకాలకు పొంతనే లేదు. రాజధాని ప్రాంతం విజయవాడలో గత 10 నెలల్లో 1,600కు పైగా మలేరియా కేసులు బయటపడగా, ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది కేవలం 25 కేసులే. అంటే కనీసం 2 శాతం కేసులను కూడా రికార్డుల్లో చేర్చలేదు. డెంగీ, మలేరియా, ఏవైనా విష జ్వరాలతో ఎవరైనా మృతి చెందితే ఆ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం కరాలవలస గ్రామంలో నెల రోజుల్లో విష జ్వరాలతో 11 మంది మృతి చెందారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాధితులు డెంగీ జ్వరంతో మరణించారు. ఇవేవీ ప్రభుత్వ రికార్డుల్లోకి చేరకపోవడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top