ఏ విద్యార్థీ ఆకలితో ఉండరాదు

AP Government orders to Education Department - Sakshi

విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు

లాక్‌డౌన్‌ సెలవుల్లో విద్యార్థులకు భోజనం సరుకులు

పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఇప్పటికే పంపిణీ

సంక్షేమ శాఖ రెసిడెన్షియల్‌ స్కూళ్ల విద్యార్థులకు పంపిణీకి ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో ప్రభుత్వ పాఠశాలలను మూసేసిన కారణంగా ఇంటివద్ద ఏ ఒక్క విద్యార్థీ ఆకలితో ఉండరాదని ప్రభుత్వం విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థుల భోజనానికి అవసరమైన సరుకులను పంపిణీ చేయాలని నిర్దేశించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికే పంపిణీ పూర్తయింది. తాజాగా వివిధ సంక్షేమ శాఖలకు చెందిన రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని విద్యార్థులకు కూడా సరుకులు అందించాలనే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పంపిణీకి సిద్ధమయ్యారు. 

పాఠశాల విద్యాశాఖలో ఇలా..
► పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న 45,723 స్కూళ్లలోని 36 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలలు మూతపడినప్పటి నుంచి ఏప్రిల్‌ 23 వరకు సరిపడేలా మధ్యాహ్న భోజనం సరుకులను ప్రభుత్వం పంపిణీ చేసింది. 
► మార్చి 19 నుంచి 31వ తేదీ వరకు తొలి విడతగా 4,073 టన్నుల బియ్యం, 2,59,92,180 గుడ్లు, 1,29,96,090 
చిక్కీలు అందించారు. 
► ఆ తరువాత లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఏప్రిల్‌ 23 వరకు సరిపడేలా 6,336 టన్నుల బియ్యం 5.5 కోట్ల గుడ్లు, 3,24,90,225 చిక్కీలు సరఫరా అయ్యాయి.
సంక్షేమ స్కూళ్లలో ఇలా..
► సంక్షేమ శాఖలకు చెందిన రెసిడెన్షియల్‌ పాఠశాలల్లోని దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు కూడా ఏప్రిల్‌ 23వ తేదీ వరకు సరిపడా సరుకులను అందించనున్నారు.
► పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నందున ఆమేరకే సరుకులు ఇచ్చారు. సంక్షేమ శాఖలు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మూడుపూటలా ఆహారాన్ని అందిస్తున్నందున ఆమేరకు అదనంగా సరుకులు ఇవ్వనున్నారు.
► వీరికి 7,414 టన్నుల బియ్యం, 1,80,49,380 గుడ్లు, 1,68,46,088 చిక్కీలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 

విద్యార్థులకు గ్రామాల్లోనే సరుకుల పంపిణీ..
విద్యాశాఖ పరిధిలో చదువుతున్న విద్యార్థులే కాకుండా వివిధ సంక్షేమ శాఖల పాఠశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) విభాగం ద్వారా ఏర్పాట్లు చేస్తున్నాం. లాక్‌డౌన్‌ వల్ల గుడ్లు, చిక్కీల సరఫరాలో సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తున్నాం. విద్యార్థులకు వారి గ్రామాల్లోనే సరుకులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. టీచర్లు, వలంటీర్ల సహకారంతో విద్యార్థులకు సకాలంలో వీటిని అందించేలా అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు.
 –చిట్టూరి శ్రీధర్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top