బెల్టు తీశారు!

AP CM Jagan Mohan Reddy Talk On Belt Shops - Sakshi

కర్నూలు:  దశల వారీ మద్యపాన నిషేధం అమలులో భాగంగా తొలి అడుగు పడింది. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలకు కారణమవుతున్న బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి పేదవారిలోనూ ఆనందం వెల్లివిరిసేందుకు ఎక్కడా బెల్టుషాపులు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో శనివారం దశల వారీగా మద్యపాన నిషేధం, బెల్టు దుకాణాల తొలగింపు తదితర అంశాలపై సమీక్ష సందర్భంగా సీఎం ఈ ఆదేశాలిచ్చారు. దీనిపై మహిళల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఐదేళ్లుగా గ్రామగ్రామాన బెల్టుషాపులు వేళ్లూనుకుపోయాయి. వీటి వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలు కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి, గొడవలు జరగడానికి ఇవి కారణమవుతున్నాయి. బెల్టుషాపులను తొలగిస్తామంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి సంతకం పెట్టినా..ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. పైగా మద్యపానాన్ని మరింత ప్రోత్సహించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని స్వయాన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే వ్యాపారులుగా మారి మద్యం ఏరులై పారించారు.

ఊరూరా బెల్టు షాపులు 
జిల్లాలో 206 మద్యం దుకాణాలు, 48 బార్లు, రెండు క్లబ్‌లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా రెండు వేలకు పైగా »బెల్టు దుకాణాలు నడుస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులే అంచనా వేశారు. లైసెన్సీలు తమకు దక్కిన దుకాణాలపై లాభాలు ఆర్జించడానికి ఊరూవాడ తమ అనుయాయులతో బెల్టుషాపులను పెట్టించారు. లైసెన్సుడు దుకాణంలో నిర్ణీత సమయంలో మాత్రమే అమ్మకాలు సాగిస్తారు. కానీ బెల్టు దుకాణాలకు నిర్ణీత సమయమంటూ ఉండదు. పల్లెల్లో  ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బెల్టు షాపులు చివరకు గాంధీ జయంతి లాంటి సందర్భాల్లోనూ తెరిచే ఉంటున్నాయి.
 
కొరడా ఝుళిపించనున్న నూతన ప్రభుత్వం 
బెల్టు దుకాణాల వల్లే మద్యం విస్తృతి, కుటుంబాలకు ఎక్కువ నష్టం కల్గుతోందని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. కావున వాటిని పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ‘ప్రజాసంకల్పయాత్ర’లో మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామగ్రామాన ఉన్న బెల్టుషాపులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు.  

మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తారు 
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మద్యపాన నిషేధాన్ని కూడా దశల వారీగా అమలు చేస్తారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు కొమ్ముకాసే విధంగా వ్యవహరించడంతో లక్షలాది  కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. – విజయలక్ష్మి వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు, కర్నూలు

 ఇకపై కఠినంగా వ్యవహరిస్తాం
ప్రభుత్వ నిర్ణయం మేరకు బెల్టు దుకాణాల నిర్మూలనపై మరింత కఠినంగా వ్యవహరిస్తాం. గతంలో బెల్టు దుకాణాలు బహిరంగంగానే నడిపేవారు. ప్రస్తుతం మొబైల్‌ వ్యాపారం సాగుతోంది. రెండు నెలల్లో 104 వాహనాలను సీజ్‌ చేశాం. 400 పై చిలుకు కేసులు నమోదు చేశాం. బెల్టు దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు గుర్తించి 12 దుకాణాలు సీజ్‌ చేశాం.  జూలై నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమలులోకి వస్తుంది. మద్యం వ్యాపారులకు కఠినంగా ఆదేశాలు జారీ చేసి.. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తాం. – చెన్నకేశవరావు, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top