బాబూ.. నీపై ఉన్న కేసుల సంగతేంటి

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu in Controversy Over Alleged in Cash-for-Vote Case - Sakshi

సాక్షి, భీమవరం : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా మంచివారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రముఖ సినీనటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని విమర్శించారు.

అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ ధ్వజమెత్తారు. భీమవరంలో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎక్కడో వ్యక్తులను కాకుండా నిత్యం అందుబాటులో ఉండే గ్రంధి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా, కనుమూరు రఘురామకృష్ణంరాజును ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. సినిమాలు వేరు రాజకీయం వేరని, దీనిని గమనించాలన్నారు. రాష్ట్రంలో కులపిచ్చిని రాజేసిన చంద్రబాబు పత్రికలు, టీవీలను తన చేతిలో పెట్టుకుని భజన చేయించుకుంటున్నాడని విమర్శించారు.

నిత్యం జగన్‌పై కేసులు గురించి మాట్లాడే చంద్రబాబు తనపై ఉన్న కేసులు సంగతేమిటో ప్రజలకు చెబితే బాగుంటుందన్నారు. ఆయన చుట్టూ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఇసుక, మట్టి మాఫియాతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. సభ్యత, సంస్కారం మర్చిపోయి ఎన్నికల సభల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడన్నారు. గత ఐదేళ్లుగా తాను ప్రజలకు ఏం చేశానో చెప్పడం లేదని మోహన్‌బాబు విమర్శించారు.

మూడెకరాల ఆసామికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పార్టీని లాకున్నాడనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.  జగన్‌ సోదరి షర్మిళను కించపర్చే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబుకు సభ్యత లేదంటూ మండిపడ్డారు.  గత ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చి పూర్తిగా మోసం చేశాడని, పసుపు–కుంకుమ పేరుతో మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సభలో గ్రంధి శ్రీనివాస్, కనుమూరు రఘురామకృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్‌ రాజు, తోట భోగయ్య, రాయప్రోలు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

భీమవరంలో ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనం, సభలో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకుడు, సినీహీరో మోహన్‌బాబు, చిత్రంలో గ్రంధి శ్రీనివాస్, రఘురామకృష్ణంరాజు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top