నిమ్మగడ్డ వ్యవహారం: ఎల్లో మీడియాపై అంబటి ఆగ్రహం

Ambati Rambabu Fires On Yellow Media Over Nimmagadda Ramesh Kumar Issue - Sakshi

సాక్షి, తాడేపల్లి: నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఈ రోజు (బుధవారం) ఏ విధమైన ఆర్డర్ ఇవ్వలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా స్టే ఇవ్వడానికి మాత్రమే సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆయన స్పష్టం చేశారు. అయితే కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు మాత్రం కోర్టులో ప్రొసీడింగ్ ఇవ్వక ముందునుంచే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంబటి మండిపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ఓ ఛానెల్ ఉదయం 9. 45 గంటల నుంచే నిమ్మగడ్డకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని తప్పుడు ప్రచారం చేయడంతో పాటుగా.. వెబ్‌సైట్‌లో రాతలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా ప్రచారం చేసిన వార్తలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాపై సర్వోన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. (నిమ్మగడ్డకు సుప్రీం నోటీసులు )

కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆర్డినెన్స్ రద్దు వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. వివాదంపై పిటిషనర్‌ (ప్రభుత్వం) లేవనెత్తిన అంశాలపై వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఇరువర్గాల వాదనలు వినేందుకు నోటీసులు జారీచేసినట్లు వెల్లడించింది. ఈ విషయం గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ... నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో.. ‘‘హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాం. మేము వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. ప్రభుత్వానికి అనుకూలంగా స్టే ఇవ్వడానికి మాత్రమే సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీం తీర్పుపై ప్రభుత్వంకు ఎదురు దెబ్బ తగిలిందని కొన్ని టీవీ ఛానెల్స్, పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రెండు పక్షాలు వాదన వినేందుకు రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో కోర్టులో ప్రొసీడింగ్ ఇవ్వక ముందు నుంచే కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. న్యాయ స్థానాల తీర్పును వక్రీకరించి ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికే చాలా ప్రమాదకరం. రెండు వారాల తర్వాత.. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే  తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు జడ్జ్ మెంట్ ఇవ్వకుండానే నిమ్మగడ్డ రమేష్‌కు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయడం నేరం. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రొసీడింగ్స్ను వక్రీకరించడం చట్ట వ్యతిరేకం. ఎల్లో మీడియానే ఇక తీర్పు చెప్పేస్తే సుప్రీంకోర్టు రెండు వారాలు తరువాత వినాల్సిన పని లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top