ఉద్దానం తాగునీటికి రూ.700 కోట్లు

Alla Nani Comments About Uddanam Issues - Sakshi

ఆర్నెల్లలో అందుబాటులోకి తెస్తాం: ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

హరిపురంలో డయాలసిస్‌ కేంద్రం

పలాస, సోంపేట డయాలసిస్‌ సెంటర్లలో అదనంగా మరో ఐదు పడకలు 

ఉద్దానం కిడ్నీ బాధిత ప్రాంతాల్లో స్పీకర్‌ 

తమ్మినేని, మంత్రి కృష్ణదాస్‌తో కలసి పర్యటన

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 22వతేదీన ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల స్థితిగతులను తెలుసుకునేందుకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ఆయన పర్యటించారు. తాగునీటి సమస్యతో కిడ్నీ వ్యాధి ప్రబలుతుందనే ఆందోళన నేపథ్యంలో రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తొలుత ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గంలోని ఏడు  మండలాలకు ఆర్నెల్లలో మంచినీరు అందిస్తామని చెప్పారు.

హరిపురంలో ప్రత్యేకంగా డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పలాస, సోంపేట డయాలసిస్‌ సెంటర్లలో అదనంగా ఐదు పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఉద్దానం ఆరోగ్యదాయని కావాలని, కిడ్నీ భూతాన్ని తరిమికొట్టాలనే ధృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. కాగా,   మంత్రి నాని బొడ్డపాడులో కిడ్నీ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. తమకు పింఛన్లు, పథకాలు ముఖ్యం కాదని, కిడ్నీ వ్యాధి నుంచి రక్షించాలని బాధితులు మొర పెట్టుకున్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో తక్షణమే నెఫ్రాలజిస్టు, ఇద్దరు రేడియోలజిస్టులను నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

పలాసలో సేవలపై అసంతృప్తి
కిడ్నీ మహమ్మారి వ్యాధిగ్రస్తుల ప్రాణాలు హరిస్తుంటే నామమాత్రపు సేవలతో సరిపెడుతున్నారని మంత్రి నాని ఆవేదన వ్యక్తం చేశారు. పలాస సీహెచ్‌సీలో కిడ్నీ బాధితులను  పరామర్శించారు. డయాలసిస్‌ కేంద్రాలను నిర్వహిస్తున్న నెఫ్రోప్లస్‌ సంస్థ పనితీరు బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెఫ్రాలజిస్టు వారానికి ఒక్కసారి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నివాస్‌కు సూచించారు. పలాస డయాలసిస్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సుభాష్‌ సమాధానం చెప్పలేకపోవడంతో ఆరోగ్యశాఖ కమిషనర్‌ రామకృష్ణను పిలిచి ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top