ఈ నెల 5 నుంచి అగ్రిగోల్డ్‌ బాధితుల నమోదు

Agri gold victims registration starts this month 5th - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్‌ స్టేషన్‌లలో ఈ నెల 5న అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలు నమోదు చేసుకుంటారని ఏపీ అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.  విజయవాడ దాసరి భవన్‌లో మంగళవారం అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ముఖ్యుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 660 మండలాల్లోని పోలీస్‌ స్టేషన్‌లలో బాధితుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. సీఐడీ పర్యవేక్షణలో జరిగే ఈ నమోదు అవకాశాన్ని అగ్రిగోల్డ్‌ బాధితులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఖాతాదారులకు ఈ సమాచారం అందించేందుకు ప్రతీ మండలానికి పది మందితో కమిటీలు వేస్తామన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాటంతో దిగివచ్చిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల పరిహారం విడుదల చేస్తూ జీవోలు ఇచ్చిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయడంలో ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పరిహారం అందజేతకు జీవోలు ఇచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోందని, తక్షణం బాధితులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని  డిమాండ్‌ చేశారు.

అగ్రిగోల్డ్‌ కంపెనీని టేకోవర్‌ చేసేందుకు ఎస్సెల్‌ గ్రూప్‌ రూ.10కోట్లు డిపాజిట్‌ చేసిందని, మరో నాలుగు వారాల్లో హైకోర్టుకు సంబంధించిన విధానం పూర్తి అవుతుందన్నారు. కొంతమంది బాధితుల వద్ద బాండ్‌లను అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తీసుకుందని, రూ.700కోట్ల వరకు చెక్‌లు ఇచ్చిందని, అటువంటి వారికి ఏ ఆధారం ఉన్న పరిగణలోకి తీసుకోవాలని ముప్పాళ్ల కోరారు.

అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌కు మూడేళ్ల జైలు శిక్ష

అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ వెంకట రామరావుకు మూడేళ్ల జైలు శిక్షతో రూ.6 వేల జరిమాన విధిస్తూ బద్వేల్‌ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. వైఎస్‌ఆర్‌ జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్ధవరంలో 300 ఎకరాల భూమి గోల్‌మాల్‌ కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top