‘ముసాయిదా విద్యావిధానాన్ని పూర్తిగా అంగీకరించడం లేదు’

adimalapu suresh speech in delhi about education system - Sakshi

ఢిల్లీ: చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన శనివారం నూతన విద్యా విధానం ముసాయిదాపై ఏపీ ప్రభుత్వం తరఫున పలు సూచనలు అందజేశారు. ‘అమ్మ ఒడి’ పథకాన్ని సమావేశంలో వివరిస్తూ.. ఈ పథకంలో 43 లక్షల మంది తల్లులు ఉన్నారని, ఒక్కో తల్లికి రూ.15 వేల చొప్పున ఏడాదికి ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా అందజేస్తున్నామని తెలిపారు.

ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ సాయం చేయాలని ఆయన కోరారు. ఇందులో విద్యార్థుల ఓట్ల రేట్లు తగ్గుతాయని, ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రూ. 5 వేల కోట్ల నిధులు కావాలని ముసాయిదాకు విజ్ఞప్తి చేశారు. మూడో తరగతి నుంచి కంప్యూటర్ బోధన జరిగేలా ఉండాలని సూచనలు చేస్తూ.. టెక్నాలజీని వీలైనంత ఏక్కువగా ఉపయోగించుకోవాలి తెలిపారు. ప్రైవేటు టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక పాలసీ రావాలని.. ప్రైవేటు పాఠశాలల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐఏఎస్ ఐపీఎస్‌ వలె ‘ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్’ కూడా ఏర్పాటు చేయాలన్నారు.  

అదేవిధంగా పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులకు సిలబస్ కూడా మార్పులు చేయాలన్నారు.  ఉన్నత విద్యలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో ఒక టాస్క్‌ ఫోర్స్‌ కూడా ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు.  ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్థానిక వనరులను బట్టి పరిశ్రమల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా రూపొందిస్తామన్నారు. పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్ కాలేజీలను స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లకు పరిశ్రమలతో  అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.  రాష్ట్ర బడ్జెట్‌లో 16 శాతం నిధులతో సుమారు రూ. 33 వేల కోట్లలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. 

దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, సీనియర్ అకడమిక్‌లను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని సూచించారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ను పూర్తిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజు విధానంపై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడిం​చారు. పాత ఫీజుల ప్రకారమే ఫీజు రియంబర్స్‌మెంట్‌ ఇస్తామని తెలిపారు. ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్న టీచర్ల స్థితిగతులపై కమిషన్ సూచనలు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవసరానికి మించి డీఎడ్ కాలేజీలు ఉన్నాయని.. డీఎస్సీ నిర్వహణకు కొంత సమయం పడుతుందన్నారు. కోర్టులో కేసుల కారణంగా కొంత ఆలస్యం అవుతోందని తెలిపారు. అక్టోబర్ చివరివరకు పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని వెల్లడించారు. హ్యాపీనెస్ ఇండెక్స్, క్వాలిటీ, పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముసాయిదా విద్యావిధానాన్ని మేము పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదు స్పష్టం చేశారు. వాటిలో కొన్ని మార్పులు చేయాలని మంత్రి సూచనలు చేశారు. మనది లౌకిక ప్రభుత్వం.. దాని ఆధారంగానే ‘విద్యావిధానం’ ఏర్పడుతుందని ఆదిమూలపు సురేష్  పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top