చనిపోయే వరకూ జనంలోనే ఉంటా : నటి

Actress Ramya Sri Exclusive Interview - Sakshi

నాకోసం అభిమానులు కన్నీళ్లు పెట్టాలి

వైఎస్సార్‌ చేసిన మేలు మరువలేను

‘సాక్షి’తో సినీనటి రమ్యశ్రీ

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ‘ఎంత కాలం బతికాం.. ఎంత సంపాదించామన్నది కాదు.. మన కడసారి ప్రయాణంలో మన కోసం ఎంత మంది కన్నీరు పెట్టారన్నది ప్రధానం.. నేను చనిపోయినా జనంలోనే ఉండాలి.. అభిమానులు నాకోసం ఏడవాలి.. అదే నా కోరిక..’ అని సినీ నటి రమ్యశ్రీ అన్నారు. వేపగుంట ఉన్నత పాఠశాలలో శనివారం రమ్య హృదయాంజలి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. తన జీవిత అనుభవాలు, ఆశయాలను వివరించారు.

300 సినిమాల్లో నటించాను
కోరుకున్న ప్రియుడితో హీరోయిన్‌ స్నేహితురాలిగా సినీ రంగ ప్రవేశం చేశాను. సూపర్‌ స్టార్‌ కృష్ణ సరసన ‘ఎవరు నేను’ చిత్రంలో తొలిసారిగా హీరోయిన్‌గా నటించాను. ఆ సినిమా నా నట జీవితానికి టర్నింగ్‌ పాయిం ట్‌. ఆ తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. దీనికి ముందు కన్నడ చిత్రం ఇంద్రజలో జ్యోతిలక్ష్మి కూతురుగా చేశా. అది హిట్టయింది. తెలుగు, కన్నడ , తమిళ, మలయాళం, ఒడియా, హిందీ, బోజ్‌పురి, పంజాబీ భాషల్లో 300 సినిమాల్లో నటించాను. తెలుగులో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, నువ్వునేను, ఆది, సింహాద్రి, సంపంగి, ఇందిరమ్మ తదితర సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. 

మల్లి సినిమాకు రెండు నందులు 
‘ఓమల్లి’ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నటించా. ఈ సినిమాకు రెండు నందులు వచ్చాయి. కన్నడలో ఆర్యభట్ట చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. 

సంపాదనలో కొంత పేదలకు.. 
నా సంపాదనలో కొంత మొత్తం పేదలకు కేటాయిస్తున్నాను. విస్తృతంగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. సినీ హీరో శ్రీకాంత్, హాస్యనటుడు బ్రహ్మానందం ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి పేదలకు సాయపడాలని సూచించారు. 

వైఎస్‌ రాజశేఖరరెడ్డే నాకు స్ఫూర్తి
నాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితం స్ఫూర్తి నిచ్చింది. ఆయన ఉన్నన్నాళ్లూ జనంలో ఉన్నారు. చనిపోయాక కూడా జనంలో బతికి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకే ఆయన మహనీయుడయ్యారు. లబ్ధిపొందిన వారిలో నేనూ ఉన్నాను. నాకు హైదరాబాద్‌లో రూ.50 లక్షల విలువైన భూమి వివాదాల్లో ఉంటే ఆయనను కలసి న్యాయం చేయాలని అర్ధించాను. వెంటనే ఆయన వివాదాన్ని పరి ష్కరించారు. ఇప్పుడా స్థలం విలువ రూ.10 కోట్లు. అంత మేలు చేసిన వైఎస్సార్‌ను ఎలా మరచిపోతాను. నేను చనిపోయే వరకూ జనంలోనే ఉంటా. వారి అభిమానం పొందుతా..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top