అనుమానంతో హత్య అంగీకరించిన భర్త | Accepted on suspicion of the murder of her husband | Sakshi
Sakshi News home page

అనుమానంతో హత్య అంగీకరించిన భర్త

Aug 13 2013 6:26 AM | Updated on Sep 2 2018 4:46 PM

కాకరాపల్లిలో గత నెల జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అనుమానంతో కట్టుకున్న భర్తే కాలయముడిలా మారి దారుణంగా హతమార్చాడు.

సంతకవిటి, న్యూస్‌లైన్: కాకరాపల్లిలో గత నెల జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అనుమానంతో కట్టుకున్న భర్తే కాలయముడిలా మారి దారుణంగా హతమార్చాడు. నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలు ఇవీ... సంతకవిటి మండలం కాకరాపల్లిలో జూలై 19వ తేదీన గెడ్డాపు చిన్నమ్మడు దారుణ హత్యకు గురయింది. అయితే తన భార్య కనిపించడంలేదని ఆమె భర్త అనంతరావు అదే నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ అనంతరావే భార్య చిన్నమ్ముడును హత్యచేసి నాటకం ఆడుతున్నాడని మృతురాలి సోదరుడు రేగిడి మండలం లక్ష్మీపురంకు చెందిన వావిలపల్లి పెంటన్నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
 ఈమేరకు కేసు నమోదుచేసిన రాజాం సీఐ ఎ.శ్రీనివాసచక్రవర్తి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అనంతరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ విషయాన్ని పాలకొండ డీఎస్పీ దేవానందశాంతో సోమవారం విలేకరులకు తెలి పారు. సీఐ శ్రీనివాసచక్రవర్తి మాట్లాడుతూ గత నెల 19న బహిర్భూమికి వెళుతున్నాను తోడు రమ్మని భార్య చిన్నమ్మడును నారాయణపురం కుడి కాలువకు వెళ్లే గోర్జీ దగ్గరకు తీసుకువెళ్లాడన్నారు. అక్కడ భార్య తల, మొహంపై రాయితో గట్టిగా కొట్టి చంపినట్లు అనంతరావు అంగీకరించాడన్నారు. అనంతరం చిన్నమ్మడు మృతదేహాన్ని నారాయణపురం కుడికాలువలో పడేసినట్లు చెప్పాడని వివరించారు. ఉదయం ఈ విషయాన్ని గ్రామపెద్దలకు చెప్పడంతో పాటు ఏమీతెలియనట్లుగా సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన భార్య చిన్నమ్మడు కనిపించట్లేదని ఫిర్యాదుచేశాడన్నారు. 
 
 తన భార్యపై అనుమానంతోనే ఇదంతా చేశాడని తెలిపారు. ఇంటికి వేరే వ్యక్తి వస్తున్నాడని పెద్దకుమారుడు  చెప్పడంతో భార్యను మందలించానని, అయినప్పట్టకీ అనుమానం ఉండడంతో ఇలా చంపేశానని అనంతరావు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడి వద్ద వివరాలు సేకరించిన అనంతరం అరెస్టు చేసి రాజాం కోర్టుకు తరలించారు. మరో వైపు చిన్నమ్మడు హత్య వెనుక భర్త అనంతరావుతో పాటు అతని తండ్రి, గ్రామానికి చెందిన మరో మహిళ ఉన్నట్లు చిన్నమ్మడు సోదరుడు పెంటన్నాయుడు ఆరోపించారని, ఈమేరకు ఆ ఇద్దరిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు స్తామని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement