‘సచివాలయ’ ఉద్యోగాలకు 22.70 లక్షల దరఖాస్తులు

Above 22 lakh applications for Village Secretariat jobs - Sakshi

ఆదివారం అర్ధరాత్రితో ముగిసిన గడువు 

ఒక్క రోజు పొడిగింపు వల్ల 58 వేల మంది అదనంగా దరఖాస్తు

నాలుగు జిల్లాల నుంచి రెండేసి లక్షల చొప్పున దరఖాస్తులు

విజయనగరం జిల్లా నుంచి అత్యల్పం 

పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో అధికారులు

రాష్ట్రేతరులు రాత పరీక్షకు అనర్హులని స్పష్టీకరణ

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాల రూపకల్పన  

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు డిగ్రీ కనీస విద్యార్హతగా నిర్ణయించినా కూడా రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. ఆదివారం రాత్రి 10.15కి 22,69,304 దరఖాస్తులు అందగా.. అందులో 21,69,609 మంది ఫీజు చెల్లించారు. విద్యుత్‌ శాఖ ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ జారీ చేసిన లైన్‌మెన్‌ ఉద్యోగాలకు మినహా మిగిలిన సచివాలయ ఉద్యోగాలకు ఆదివారం అర్ధరాత్రి 11.59తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. దరఖాస్తు ఫీజు చెల్లించిన వారు మాత్రమే పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత ఉంటుంది. వాస్తవంగా శనివారం అర్ధరాత్రికి దరఖాస్తుల స్వీకరణ ముగియాల్సి ఉండగా, వరదల కారణంగా ఇబ్బంది పడేవారి కోసమని ఆదివారం అర్ధరాత్రి వరకు గడువు పొడిగించారు. ఈ సదుపాయం వల్ల ఆదివారం 58,350 మంది అదనంగా దరఖాస్తులు చేసుకున్నారు. కేటగిరీ– 1లో పేర్కొన్న నాలుగు రకాల ఉద్యోగాలకు కలిపి నిర్వహించే ఒకే రకమైన రాత పరీక్షకు అత్యధికంగా 12,86,984 దరఖాస్తులు అందాయి.

ఈ కేటగిరీలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, గ్రామ, వార్డు మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ ఉద్యోగాలు ఉంటాయి. కేటగిరి–2 (ఏ)లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ ఉద్యోగాలకు 1,41,325 మంది, కేటగిరి– 2 (బీ)లో భర్తీ చేసే వీఆర్వో, సర్వే అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 1,72,418 దరఖాస్తులు అందాయి. కేటగిరిలో–3లో మిగిలిన 11 రకాల ఉద్యోగాలకు మొత్తం 6,68,577 దరఖాస్తులు అందాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 2,13,751 దరఖాస్తులు అందాయి. విశాఖ, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి కూడా రెండేసి లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. విజయనగరం జిల్లా నుంచి అత్యల్పంగా దరఖాస్తులు అందినట్టు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రేతరులు రాత పరీక్షకు అనర్హులు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా స్థానికతకు అర్హతలేని వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా.. రాతపరీక్ష రాయడానికి వీలు ఉండదని, వారికి హాల్‌టికెట్లు జారీ చేసే అవకాశం లేదని నియామకాల ప్రక్రియకు ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్‌ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న వారిలో 6,397 మంది రాష్ట్రేతరులుగా పేర్కొంటూ దరఖాస్తులు సమర్పించారు. వీరిలో రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో చదివి, విభజన తర్వాత నిబంధనల మేరకు ఏపీ స్థానికతను అధికారికంగా పొందిన వారికి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

పరీక్ష నిర్వహణపై అధికారులు దృష్టి
దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో అధికారులు ఇప్పుడు రాత పరీక్ష నిర్వహణపై దృష్టి పెట్టారు. 8 వేలకు పైగా పరీక్షా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్‌సీ)ల ఆధ్వర్యంలో రాతపరీక్షలు జరుగుతున్నప్పటికీ.. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ప్రశ్నపత్రాల రూపకల్పన జరుగుతుందని అధికారులు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top