వృద్ధులు కాదు ‘ముదుర్లు’!

Aadhar Card Birth Date Changing For Pension Scheme Anantapur - Sakshi

అడ్డదారిలో పింఛన్లు

ఆధార్‌లో 65 ఏళ్లుగా వయస్సు మార్పు

పాన్‌ కార్డు ఆధారంగా కొత్త తరహా మోసం

బెంగళూరు, బళ్లారి కేంద్రంగా వ్యవహారం

జిల్లాలోని ‘మీసేవ’లతో లింకు

రూ.10వేల వరకు దండుకుంటున్న దళారుృలు

కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని జీనులకుంట గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత వాస్తవానికి 1971వ సంవత్సరంలో జన్మించాడు. అయితే, పింఛను కోసం ఆధార్‌లో ఏకంగా 1956లో పుట్టినట్టు మార్పించుకున్నారు. అంటే.. 49 ఏళ్ల వయస్సును ఏకంగా 64 ఏళ్లకు మార్పు చేసుకొని అక్రమంగా     పింఛను పొందుతున్నాడు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. ప్రభుత్వం అడ్డుకట్ట వేశాం అనుకునేలోగా.. మరో కొత్త మోసం వెలుగులోకి వస్తోంది. సామాజిక భద్రత పింఛన్ల విషయంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. తాజాగా వయస్సు మార్పుతో పింఛను పొందుతున్న వాళ్లు కొందరైతే.. కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లు మరికొందరు. నడి వయస్కులు కూడా వృద్ధులుగా ఆధార్‌లో పుట్టిన తేదీని మార్పుకొని వృద్ధాప్య పింఛనుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. 60 ఏళ్లు పైబడినట్లుగా పుట్టిన తేదీలో మార్పులు చేసుకొని, పింఛను దరఖాస్తుకు కొత్త ఆధార్‌ను సమర్పిస్తున్నారు. ప్రధానంగా శింగనమల, తాడిపత్రి, కదిరి, పుట్టపర్తి, అనంతపురం, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీగా ఇలాంటి మోసాలు జరిగినట్టు సమాచారం. బెంగళూరు, బళ్లారిలోని మీ సేవ కేంద్రం నిర్వాహకులు జిల్లాలోని ఏజెంట్ల ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

పాన్‌కార్డు ద్వారా తతంగం
ఆధార్‌లో వయస్సు మార్పుచేర్పులను గతంలో స్థానికంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో చేశారు. అయితే, ఇందులో అక్రమాలు బయటపడటంతో మీ సేవా కేంద్రాల్లో ఈ ఆప్షన్‌ను కుదించారు. కేవలం మూడేళ్ల పరిమితికి లోబడి మాత్రమే మార్పుచేర్పులు చేయాలని.. అది కూడా పాన్‌కార్డు వంటి సరైనఆధారాలు ఉంటేనే చేయాలని దాదాపు రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అక్రమాలకు కొద్దివరకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఆ తర్వాత బ్యాంకులతో పాటు మరికొన్ని కొత్త ఏజెన్సీలకు ఆధార్‌లో మార్పుచేర్పులకు అవకాశం కల్పిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఏజెన్సీలు పాన్‌కార్డు ద్వారా ఇష్టారీతిన వయస్సులో మార్పుచేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం పాన్‌కార్డు చూపిస్తే చాలు.. అందుకు తగినట్టుగా వయస్సులో మార్పులు చేస్తున్నట్టు సమాచారం. 

కొత్త పాన్‌కార్డు తీసుకుంటే సరి..
ఆధార్‌లో వయస్సు మార్పు చేర్పులు చేయడం ఇప్పుడు చాలా సులభమైన ప్రక్రియగా మారింది. అక్రమార్కులు తలుచుకుంటే నడివయస్కులు కూడా ఇట్టే ముసలివాళ్లు అయిపోతున్నారు. ఇందుకోసం కొత్తగా పాన్‌ కార్డు తీసుకుంటే సరిపోతుంది. పింఛనుకు అవసరమైన వయస్సుతో దరఖాస్తు చేసుకుంటే కొత్త పాన్‌కార్డు వచ్చేస్తుంది. దీని ఆధారంగా ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచిన నేపథ్యంలో వయస్సును పెంచి దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారంతా వయస్సులో మార్పుచేర్పులకు అక్రమార్కులను ఆశ్రయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు లోతుగా విచారణ చేయిస్తే అక్రమాలు బట్టబయలు అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆమెకు 65.. ఆయనకు 48
పుట్లూరు మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ వృద్ధాప్య పింఛను కోసం తన వయస్సును 65 సంవత్సరాలుగా మార్పు చేయించుకుంది. ఇందుకోసం ఓ దళారికి రూ.3వేలు ముట్టజెప్పింది. తాడిపత్రిలోని ఓ బ్యాంకులో నిర్వహిస్తున్న ఆధార్‌ కేంద్రంలో ఈ తతంగం సాగింది. అయితే ఈమె భర్త వయస్సు 48 సంవత్సరాలు కావడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top