ప్రభుత్వం తీరు చూస్తే అమలులో ఉన్న ఒక్కొక్క సంక్షేమ పథకానికి కత్తెర వేస్తున్నట్టు కనిపిస్తోంది. పొమ్మనలేక పొగపెడుతున్న వైనం లబ్ధిదారులను
ఉపాధికీ ఆధార్ ముడి
Feb 28 2014 2:14 AM | Updated on May 25 2018 6:21 PM
సత్తెనపల్లిరూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వం తీరు చూస్తే అమలులో ఉన్న ఒక్కొక్క సంక్షేమ పథకానికి కత్తెర వేస్తున్నట్టు కనిపిస్తోంది. పొమ్మనలేక పొగపెడుతున్న వైనం లబ్ధిదారులను కలవర పెడుతోంది. ఇందులో భాగంగానే ఉపాధి పనులకూ ప్రభుత్వం ఆధార్‌తో ముడిపెట్టింది. ఇకపై మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించే పనులకు కూలి చెల్లించాలంటే ఆధార్ నంబరు తప్పని సరి అంటూ ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే కూలి చెల్లించేది లేదని తెగేసి చెప్పేసింది. మార్చి నుంచి ఈ నిబంధన అమలవుతుందని స్పష్టం చేసంది.
పని దినాలను తగ్గించే పనిలో భాగంగానే ప్రభత్వుం ఇలాంటి మెలిక పెట్టిందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ వందరోజులు పనిదినాలు కల్పిస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి కనబర్చడం లేదు. గతంలో పనులు చేయకుండానే చేసినట్టు రికార్డులు చూపి నిధులు స్వాహా చేసే వారి అక్రమాలకు ఈ మస్టర్ విధానంతో అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు కూలీ చెల్లింపులో జాప్యం, బినామీ పేర్లతో నిధులు కాజేస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు ఆధార్ అనుసంధానం చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల పనిదినాలు బాగా తగ్గే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట. జిల్లాలోని సత్తెనపల్లి రూరల్ మండలాన్ని పరిశీలిస్తే 24 గ్రామ పంచాయతీలలో మొత్తం 13,141 జాబ్‌కార్డుహోల్డర్స్ ఉన్నారు.
ఇప్పటికి 10,568 మంది మాత్రమే ఆధార్ కార్డులు అనుసంధానం చేసుకున్నారు. గత ఏడాది సుమారు మూడు కోట్ల రూపాయల మేర ఉపాధి పథకం ద్వారా పనులు చేపట్టి చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ.1.66కోట్ల మేర వివిధ పనులకు చెల్లించారు. మరో రూ.2 కోట్ల విలువగల పనులు చేపట్టేందుకు అంచనా ప్రణాళికలు తయారు చేసినట్లు ఉపాధి హామీ సిబ్బంది తెలిపారు. అనుసంధాన ప్రక్రియ పూర్తి స్థాయిలో మార్చి నెల నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామాలలో వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టాయి. మరో వారంలో పనులు లేక అవస్థలు పడే అవకాశం ఉంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పనుల కోసం కొందరు వలసలు వెళ్లారు. ఆధార్ తప్పనిసరి చేయటంతో పనికి వెళ్లినా కార్డు లేకుంటే కూలీ రాదన్న భయం కార్డుదారుల్లో నెలకొంది.
నిర్మల్ భారత్ అభియాన్‌కు తప్పనిసరి..
నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నుంచి రూ.5,400 లను అందిస్తారు. లబ్దిదారులు సాయం పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డును జతపరచాల్సి ఉంటుంది. మండలంలో 5 గ్రామాలకు చెందిన 1054 కుటుంబాలు ఈ పథకానికి ఎంపికైనట్లు ఉపాధి హామీ పథకం సిబ్బంది తెలిపారు. ఆయా లబ్ధిదారులు ఆధార్ నంబర్ ను అందిస్తేనే రుణం వారి ఖాతాల్లో జమవుతుందన్నారు. గతంలో ఆధార్ కార్డు ప్రక్రియ జరిగినప్పుడు ఫొటోలు దిగినప్పటికీ కొందరికి కార్డులు అందలేదు. మరికొందరు ఫొటోలు దిగేందుకు సుముఖత చూపలేదు. ప్రభుత్వం ప్రతి పథకానికీ ఆధార్ లింకేజీ చేయాలని షరతు పెట్టడంతో లబ్ధిదారులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొంత మంది కార్డులు ఉన్నప్పటికీ వాటిల్లో తప్పులు దొర్లడంతో సరిచేసుకునే విధానం తెలియక సంక్షేమ ఫలాలు పొందే అవకాశం కోల్పోతున్నారు.
Advertisement
Advertisement