జిల్లాలో ఓటర్ల తుది జాబితా విడుదలైంది. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ జాబితా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
సార్వత్రిక ఎన్నికలకు
ముందు తుది జాబితా ప్రకటన
జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
పురుష ఓటర్ల సంఖ్య : 17,46,901
మహిళా ఓటర్ల సంఖ్య : 17,91,806
ఇతరులు : 304 మంది
పెరిగిన ఓటర్లు : 1,15,015 మంది
జనాభాలో ఓటర్ల నిష్పత్తి : 70.3 శాతం
సాక్షి, గుంటూరు
జిల్లాలో ఓటర్ల తుది జాబితా విడుదలైంది. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ జాబితా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 35,39,011 మంది ఓటర్లు వున్నారు. వీరిలో 17,41,907 పురుష ఓటర్లు కాగా, 17,89,834 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఓట్లకు మిలటరీ ఉద్యోగుల ( సర్వీసు ఎలక్టర్స్) ఓట్లు కలిపి మొత్తం 35,39,011 మందితో ఓటర్ల తుది జాబితాను శుక్రవారం సాయంత్రం జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. పురుష, మహిళా ఓటర్ల నిష్పత్తి 1000:1028గా ఉంది. అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,028 మంది మహిళలు ఉన్నట్లు తేలింది. గత ఏడాది నవంబరు 18న ప్రకటించిన డ్రాఫ్ట్ ఓటర్ల సంఖ్యతో పోలిస్తే తుది జాబితాలో 1,15,015 మంది పెరిగారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో 34,23,996 మంది ఓటర్లున్నారు. అంటే 3.16 శాతం మేర ఓటర్లు పెరిగారు.జనాభాలో ఓటర్ల నిష్పత్తి (ఈపీ రేషియో) 70.3 శాతంగా ఉంది. మిలటరీ ఉద్యోగుల ఓటర్లు జిల్లాలో 6,966 వున్నారు. వీరిలో పురుషులు 4,994 కాగా, మహిళలు 1,972 మంది వున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే
ఓటర్లు అధికం.. జిల్లాలోకెల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 2,43,918 మంది ఓటర్లు ఉంటే, సర్వీసు ఓటర్లు 244 మంది ఉన్నారు. మొత్తం కలిపి 2,44,162 మంది ఓటర్లున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లు గుంటూరు పశ్చిమ,తూర్పు నియోజకవర్గాల్లో అధికంగా నమోదయ్యారు. ఓటర్ల సంఖ్యలో గుంటూరు పశ్చిమ తరువాతి స్థానాల్లో గురజాల, మాచర్ల, తెనాలి నియోజకవర్గాలు ఉన్నాయి. అత్యల్పంగా ఓటర్లు బాపట్ల నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ 1,66,520 మంది వున్నారు.ఇదిలావుంటే, తుది జాబితా ప్రకటన తర్వాత కూడా నిరంతర ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెబుతున్నా, ఇకపై జరిగే చేర్పులకు ఎన్నికల జాబితాలో చోటు దక్కే అవకాశం ఉండదు.
నగరంలో 4,59,435 మంది ఓటర్లు
అరండల్‌పేట : నగరంలో మొత్తం 4,59,435 మంది ఓటర్లు ఉన్నట్లు నగర కమిషనర్ కె వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ప్రకటించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో 2,15,517 మంది ఉండగా వీరిలో 106735 మంది పురుషులు, 108764 మంది స్త్రీలు, 18 మంది ఇతరులు ఉన్నారనీ, పశ్చిమ నియోజకవర్గంలో 2,43,918 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1.20.715 మంది పురుషులు, 1,23,159 మంది స్త్రీలు, 44 మంది ఇతరులు ఉన్నారనీ తెలిపారు. ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం కార్పొరేషన్ కార్యాలయం, తహశీల్దారు, ఆర్‌డీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో 39,935 మంది కొత్తగా ఓటు హక్కును పొందారని చెప్పారు. గత నవంబర్ 18నాటికి న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 2,21,586 మంది ఓటర్లు ఉండగా తాజాగా 2,43,918 మంది ఉన్నారనీ, ఇక్కడ కొత్తగా 22,332 మంది చేరారు. వీరిలో 11,542 మంది స్త్రీలు, 10,760 మంది పురుషులు, ఇతరులు 30 మంది ఉన్నారన్నారు. తూర్పు నియోజకవర్గం లో 1,97,914 మంది ఓటర్లు ఉండగా తాజాగా 2,15,517 మంది ఉన్నారన్నారు. ఇక్కడ 17,603 మంది కొత్తగా ఓటుహక్కు పొందారనీ, వీరిలో 9,138 మంది స్త్రీలు, 8,449 మంది పురుషులు, 16 మంది ఇతరులు ఉన్నారని వివరించారు.