జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయిగా నిలిచింది. తాజాగా విడుదలైన ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయిగా నిలిచింది. తాజాగా విడుదలైన ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 24 లక్షల 9 వేల 217 మంది ఓటర్లుండగా, వారిలో పురుషులు 11 లక్షల 99 వేల 58 మంది, మహిళలు 12 లక్షల 10 వేల 25 మంది ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్లు 10,967 మంది అధికంగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మహిళల పల్లకిని మోయాల్సిన పరిస్థితి నెలకొంది.
30-39 మధ్య వారే ఎక్కువ...
స్త్రీ, పురుష ఓటర్లలో 30 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్లే అధికం. 30-39 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లు 6 లక్షల 38 వేల 738 మంది ఉన్నారు. 18-19 సంవత్సరాల మధ్య ఉండి కొత్తగా ఓటుహక్కు పొందినవారు 55,682 మంది ఉన్నారు.
ఒకవైపు మహిళలకు జేజేలు కొడుతూ, ఇంకోవైపు ఈ రెండు వయసుల కేటగిరీలను దగ్గరకు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పార్టీల పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా వయస్సుల వారీగా చూసుకుంటే ఈ వయసు ఓటర్లే అధికంగా ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్న వారికి దగ్గరగా వెళితే అనుకూల ఫలితాలు వస్తాయన్న భావన కూడా రాజకీయ పార్టీల్లో నెలకొంది.