రాష్ట్రానికి 25 కంపెనీల అదనపు బలగాలు | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి 25 కంపెనీల అదనపు బలగాలు

Published Fri, Feb 21 2014 3:56 AM

రాష్ట్రానికి 25 కంపెనీల అదనపు బలగాలు - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి ఢిల్లీలో పరిణామాలు వేగవంతంగా సాగుతున్న క్రమంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా కేంద్రం 25 కంపెనీల(ఒక్కొక్క కంపెనీలో దాదాపు 90 మంది సైనికులు లేదా భద్రతా సిబ్బంది ఉంటారు) అదనపు బలగాలను రాష్ట్రంలో మోహరించింది. ఇప్పటికే ఉన్న 60 కంపెనీల బలగాలకు ఇవి అదనంగా భద్రతా విధులు నిర్వహించనున్నాయి.
 
 తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న దశలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు 90 కంపెనీల పారామిలిటరీ బలగాలను కేంద్రం అప్పట్లోనే రాష్ట్రానికి పంపింది. అయితే, రెండు నెలల కిందట జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వీటిలోని 30 కంపెనీల బలగాలను కేంద్రం వెనక్కి తీసుకుంది. కాగా, ప్రస్తుతం విభజన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ముందస్తు భద్రత నిమిత్తం పారామిలిటరీ బలగాలను పంపాలన్న డీజీపీ ప్రసాదరావు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోం శాఖ తాజాగా 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement