‘పోలవరం’లో ఇలాగైతే ఎలా? | NHPC committee fires on state govt on polavaram | Sakshi
Sakshi News home page

‘పోలవరం’లో ఇలాగైతే ఎలా?

Dec 31 2017 1:22 AM | Updated on Nov 9 2018 5:56 PM

NHPC committee fires on state govt on polavaram - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని పేర్కొంటూ జాతీయ జల విద్యుదుత్పత్తి సంస్థ(ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. కాంక్రీట్‌ పనులు(స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌) నత్తనడకన సాగుతున్నాయని, 2018 ఆఖరు నాటికి గ్రావిటీ(గురుత్వాకర్షణ శక్తి) ద్వారా కాలువలకు నీళ్లందించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తే 2019 జూన్‌ నాటికైనా పాక్షికంగా కూడా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదని కుండ బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు తొలి డిజైన్‌ ప్రకారమే పనులు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటూ ఈ నెల 28న కేంద్రానికి ఏకే ప్రధాన్‌ నేతృత్వంలోని ఎన్‌హెచ్‌పీసీ కమిటీ నివేదిక ఇచ్చిందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వర్గాలు వెల్లడించాయి. 

మాటలకు చేతలకు పొంతనేదీ?
2018 నాటికి ప్రాజెక్టును పాక్షికంగా పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతనే లేదని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికలో ముఖ్యాంశాలు..
- నదీ ప్రవాహాన్ని స్పిల్‌ వే వైపునకు మళ్లించే అప్రోచ్‌ చానల్‌లో ఇప్పటికీ 101 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులను ప్రారంభించనే లేదు. స్పిల్‌ వే నుంచి విడుదల చేసే వరద నీటిని నదిలో కలపడానికి తవ్వాల్సిన స్పిల్‌ చానల్‌ పనుల్లో ఇంకా 67 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాలి. స్పిల్‌ చానల్‌లో అత్యంత ప్రధానమైన కొండను(హిల్‌ 902) తొలిచే పనుల్లో 77 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని మిగిలిపోయింది. స్పిల్‌ చానల్‌ నుంచి నదిలోకి వరద నీటిని మళ్లించడానికి తవ్వాల్సిన పైలెట్‌ చానల్‌లో ఇంకా 31 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని చేయాలి. 
- స్పిల్‌ వేలో 8.41 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు, 48 గేట్లను బిగించే పనులు పూర్తి చేయాలి. స్టిల్లింగ్‌ బేసిన్‌లో 3.46 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు, స్పిల్‌ చానల్‌లో 18 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మిగిలిపోయాయి.
- ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పునాది(డయాఫ్రమ్‌ వాల్‌) పనులు కేవలం 51.8 శాతమే(739.4 మీటర్లు) పూర్తయ్యాయి. కుడి, ఎడమ వైపున కాలువలకు నీళ్లందించేలా హెడ్‌ రెగ్యులేటర్, సొరంగాల పనుల్లో ఏమాత్రం కదలిక లేదు. 
- రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులన్నీ పూర్తి చేయకుండానే 2018 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా కాలువలకు నీరు ఎలా సరఫరా చేయగలదని కమిటీ తన నివేదికలో ప్రశ్నించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement