
సాక్షి,విజయవాడ: న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. వాంతులు, విరేచనాలతో న్యూ రాజరాజేశ్వరి పేట వాసులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలతో శ్రీరామ నాగమణి అనే మహిళ మృతి చెందారు. కలుషిత నీరు తాగి సుమారు 16మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు రెండురోజుల నుంచి న్యూ రాజరాజేశ్వరి పేట వాసులు అనారోగ్యంపై సమాచారం అందుకున్న వైద్యులు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రజల అనారోగ్యానికి ఇప్పటి వరకూ సరైన కారణం తెలియలేదని డీఎం&హెచ్ఓ సుహాసిని తెలిపారు. అయితే, కలుషిత నీరు తాగడం వల్లే తాము అనారోగ్యానికి గురయ్యామని న్యూరాజరాజేశ్వరీ పేట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైనా ప్రభుత్వం సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించడం విఫలమైందని మండిపడుతున్నారు.
