ధాన్యం కొనుగోళ్లపై వాస్తవాలు..విమర్శలు గుప్పించిన ఉత్తమ్‌ | Uttam Kumar Reddy slams ktr | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లపై వాస్తవాలు..విమర్శలు గుప్పించిన ఉత్తమ్‌

May 21 2026 9:19 PM | Updated on May 21 2026 9:19 PM

Uttam Kumar Reddy slams ktr

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన రైతుల సంక్షేమంపై లేఖలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో పది మంది రైతులు మృతి చెందారని చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా చనిపోలేదు’ అని స్పష్టం చేశారు.

రికార్డు స్థాయి కొనుగోళ్లు
ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైంది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 2025-26 రబీ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 5429 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు చేరగా, ప్రభుత్వం 46.21 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రైతులకు ఇప్పటి వరకు 7,841 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. మొత్తం 6.3 లక్షల మంది రైతులు ఈ ప్రక్రియలో లాభం పొందారు. ధాన్యం తరలింపుకు 13,000 వాహనాలు, నిల్వకు 18.3 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు.

బీఆర్‌ఎస్ పాలనపై ఆరోపణలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, మిల్లర్లతో లాలూచీ, చెల్లింపుల ఆలస్యం జరిగిందని ఆరోపించారు. మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పరిస్థితి వారి అవినీతి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టుపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతూ, నీటి వనరులను రైతుల భవిష్యత్ కోసం వినియోగించే విధానాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీటి సరఫరా పై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement