అందరి దృష్టి కోహ్లిపైనే | Todays match between Bengaluru and Hyderabad at Uppal Stadium | Sakshi
Sakshi News home page

అందరి దృష్టి కోహ్లిపైనే

May 22 2026 2:51 AM | Updated on May 22 2026 2:51 AM

Todays match between Bengaluru and Hyderabad at Uppal Stadium

నేడు ఉప్పల్‌ స్టేడియంలో బెంగళూరు, హైదరాబాద్‌ జట్ల మధ్య పోరు

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ 19వ సీజన్‌ లీగ్‌ దశను అగ్రస్థానంతో ముగించాలనే లక్ష్యంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు తమ ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఉప్పల్‌ స్టేడియంలో నేడు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో ఆర్‌సీబీ తలపడనుంది. టాప్‌–2లో నిలిచి ఫైనల్‌ చేరేందుకు రెండు అవకాశాలను సంపాదించాలని సన్‌రైజర్స్‌ కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్‌ రెండు జట్లకు కీలకంగా మారగా... అందరి దృష్టి మాత్రం ఆర్‌సీబీ సూపర్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లిపైనే కేంద్రీకృతమైంది. 

రెండేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో ఆడనున్న కోహ్లి ఆటతీరును ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఉబలాటపడుతున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో కోహ్లికి మంచి రికార్డే ఉంది. ఈ స్టేడియంలో 10 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన అతను 486 పరుగులు చేశాడు. గత శుక్రవారం ఈ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ప్రారంభించగా... నిమిషాల వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయాయి. కోహ్లి ప్రధాన ఆకర్షణ కానుండటంతో దీనిని సొమ్ము చేసుకోవాలని సన్‌రైజర్స్‌ యాజమాన్యం భావించి ఈ మ్యాచ్‌ టికెట్ల ధరలను భారీగా పెంచేసింది. 

మరోవైపు సాధారణ ప్రేక్షకులకు టికెట్లు లభించలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్థాయిభేదం లేకుండా ఎవరికి వారు తమ పరపతిని ఉపయోగించి ఈ మ్యాచ్‌ టికెట్లను సంపాదించడంపైనే దృష్టి పెట్టారు. దాంతో నిజమైన అభిమానుల గోడు వినేవాళ్లే కరువయ్యారు. రజత్‌ పాటీదార్‌ సారథ్యంలోని బెంగళూరు బృందం ఈ సీజన్‌ను సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌తోనే ప్రారంభించింది. ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో గెలిచి శుభారంభం చేసింది. అదే జోరును కొనసాగిస్తూ ప్రస్తుతం 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిస్తే ఆర్‌సీబీ 20 పాయింట్లతో టాపర్‌గా ముగిస్తుంది.

27
ఆర్‌సీబీ, సన్‌రైజర్స్‌ జట్లు ముఖాముఖిగా 27 సార్లు తలపడ్డాయి. ఆర్‌సీబీ 12 మ్యాచ్‌ల్లో... సన్‌రైజర్స్‌ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్‌ రద్దయింది. ఇక ఉప్పల్‌ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. ఆరింటిలో సన్‌రైజర్స్, రెండింటిలో బెంగళూరు గెలుపొందాయి.

Advertisement
 
Advertisement
Advertisement