డోపింగ్‌ నిరోధానికి కేంద్రం కసరత్తులు | Prepare for strict action against distributors of banned catalysts | Sakshi
Sakshi News home page

డోపింగ్‌ నిరోధానికి కేంద్రం కసరత్తులు

May 22 2026 2:43 AM | Updated on May 22 2026 2:43 AM

Prepare for strict action against distributors of banned catalysts

నిషేధిత ఉత్ప్రేరకాల పంపిణీ దారులపై కఠిన చర్యలకు సిద్ధం

ఐదేళ్లు జైలుశిక్షతోపాటు రూ. 2 లక్షలు జరిమానా

త్వరలో జాతీయ డోపింగ్‌ నిరోధక చట్టం  

న్యూఢిల్లీ: భారత క్రీడారంగం నుంచి డోపింగ్‌ మహమ్మారిని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇటీవల జాతీయ డోపింగ్‌ నిరోధక చట్టాన్ని సవరించగా... తాజాగా దాంట్లో మరిన్ని మార్పులు చేశారు. అథ్లెట్లకు నిషేధిత ఉ్రత్పేరకాలు అందించే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకోనున్నారు. పంపీణీ దారులకు ఐదేళ్ల వరకు జైలు శిక్షలు విధించడంతో పాటు తెలిసి నిషేధిత ఉ్రత్పేరకాలను సూచించిన వైద్యులను సైతం కఠినంగా శిక్షించనున్నారు. ప్రతిపాదిత సవరణలను ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ కోసం క్రీడా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

వచ్చేనెల 18 వరకు ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు తెలవపచ్చని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సవరించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ‘క్రీడాకారులకు నిషేధిత ఉ్రత్పేరకాలు సరఫరా చేసిన వారికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా పడుతుంది. డోపింగ్‌ ముప్పును అరికట్టేందుకు విస్తృత అవగాహన అవసరం. 

నిషేధిత ఉ్రత్పేరకాల వ్యవస్థీకృత సరఫరాను కఠిన నేరంగా పరిగణిస్తున్నాం. ఆటల నుంచి డోపింగ్‌ను రూపుమాపేందుకు అవసమైన అన్నీ చర్యలు తీసుకుంటాం. ఇక మీదట భారత క్రీడారంగంలో డోపింగ్‌ అనే పదం వినబడకూడదు. దానికి సరఫరాదారులు, సూచించేవారు అందరిపైనా చర్యలు తీసుకుంటాం. అథ్లెట్లను తప్పుదోవ పట్టించి నిషేధిత మందులు వాడేవిధంగా పురిగొల్పే వారు ఎవరైనా వదిలిపెట్టం’ అని మాండవీయ పేర్కొన్నారు. 

ఇటీవల అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) వెల్లడించిన జాబితాలో... భారత్‌ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా దేశంలో నిషేధిత మందులు వాడుతున్న అథ్లెట్ల సంఖ్య భారీగా పెరుగుతుండగా... 2030లో అహ్మదాబాద్‌ వేదికగా మన దేశంలో కామన్వెల్త్‌ క్రీడలు నిర్వహించనున్న నేపథ్యంలో పూర్తి ప్రక్షాళన చేయాలని  క్రీడా శాఖ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement