ఐపీఎల్-2026 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ముగించింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘోర పరాజయం పాలైంది. దీంతో సీఎస్‌కే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది.
ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చెన్నైకు ప్లే ఆఫ్స్ రేసులో ఉండేది. కానీ ఓడిపోవడంతో ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కే కథ ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.
శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84), జోస్ బట్లర్ (27 బంతుల్లో 57 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి తలా వికెట్ సాధించారు. ఆ తర్వాత 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే.. గుజరాత్ బౌలర్ల ధాటికి 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.
గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
చదవండి: గుజరాత్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు!.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర


