
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (4 బంతుల్లో 1) విఫలమైనా, మిగతా బ్యాటర్లంతా సత్తా చాటారు. వన్‌డౌన్‌లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ 14 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 30, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45, నేహల్ వధేరా 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 16 పరుగులు చేశారు.
ఆఖర్లో శశాంక్ సింగ్ తాండవం చేశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో అజేయమైన 33 పరుగులు చేశాడు. ఇదే సమయంలో స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝులిపించాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రాఠీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. 73 పరుగులకే తమ కీలక బ్యాటర్ల వికెట్లన్నీ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో టాపార్డర్ పేక మేడలా కూలింది. అర్షదీప్ 27 పరుగులకే మార్క్రమ్ (13), మిచెల్ మార్ష్ (0), నికోలస్ పూరన్‌ను (6) ఔట్ చేశాడు.
ఆతర్వాత ఒమర్‌జాయ్.. రిషబ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్‌ను (11) పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సమద్ ఔటయ్యే సమయానికి (16.4వ ఓవర్) లక్నో 20 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉండింది. దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్ తొలి బంతికి బదోని కూడా ఔటయ్యాడు. దీంతో లక్నో ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్షదీప్ 3, ఒమర్‌జాయ్ 2, జన్సెన్, చహల్ తలో వికెట్ తీసి లక్నోను దెబ్బ కొట్టారు.
ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్‌కు చేరువయ్యింది. ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల జయాపజయాలపై వారి ఫేట్ ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం లక్నో రన్ రేట్ (-0-469) కూడా చాలా తక్కువగా ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో ఈ ఒక్క జట్టు రన్‌రేట్ మాత్రమే మైనస్‌లో ఉంది. లక్నో ఒక వేళ మూడు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే భారీ తేడాతో గెలవాలి.
మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాము. రాంగ్ టైమ్‌లో కీలక క్యాచ్‌లు వదిలేశాము. అది బాగా దెబ్బకొట్టింది. జారవిడిచిన క్యాచ్‌ల ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని అనుకున్నాము. మేము ఆదిలోనే లయ తప్పాము. అక్కడే మ్యాచ్ కోల్పోయాము. ఇప్పటికీ మా ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్‌లను గెలిస్తే, మేము ఖచ్చితంగా రేసులో ఉంటాము.
సీజన్ మొత్తంలో మా టాపార్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. అయితే ప్రతి మ్యాచ్‌లో వారి నుంచే ఆశించలేము. ప్రతిసారి వారు జట్టును గెలిపించలేరు. మిగతా వారు కూడా బాధ్యత తీసుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్‌లో మేము భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. అది తీవ్రంగా బాధించింది