ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నీ బరిలో భారత జట్టు
భోపాల్: ఈనెలాఖరులో మొదలయ్యే ఆసియా కప్ అండర్–18 పురుషుల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును గురువారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ఫార్వర్డ్ కేతన్ కుశ్‌వాహా సారథ్యం వహిస్తాడు. ఆసియా కప్ టోర్నీ మే 29 నుంచి జూన్ 6 వరకు జపాన్‌లోని కాకామిగాహారా పట్టణంలో జరుగుతుంది. భోపాల్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ శిబిరం అనంతరం ఈ జట్టును ఎంపిక చేశారు.
ఆసియా కప్ సన్నాహాల్లో భాగంగా ఆ్రస్టేలియా అండర్–18 జట్టుతోనూ భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిని ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. పూల్ ‘ఎ’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, కజకిస్తాన్ జట్లతోపాటు భారత్‌కు చోటు కల్పించారు.
భారత్ తమ తొలి మ్యాచ్‌ను కజకిస్తాన్‌తో మే 29న ఆడుతుంది. అనంతరం మే 31న జపాన్‌తో, జూన్ 1న దక్షిణ కొరియాతో, జూన్ 3న చైనీస్ తైపీతో టీమిండియా తలపడుతుంది. పూల్ ‘ఎ’... పూల్ ‘బి’లో టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
భారత అండర్–18 హాకీ జట్టు: సావన్ కుమార్, ఆయుశ్ రజక్ (గోల్‌కీపర్లు), అన్ష్ బహుత్రా, అర్మాన్ సోరెంగ్, ఆశిష్ తానిపుర్తి, అర్ష్ దీప్ సింగ్, అవి మాణిక్‌పురి, రోమిత్ పాల్ (డిఫెండర్లు), రాహుల్ యాదవ్, ప్రేమ్‌చంద్ సోయ్, వరీందర్ సింగ్, కరణ్ గౌతమ్, సిద్ధార్థ్ బెన్ (మిడ్‌ఫీల్డర్లు), కేతన్ కుశ్‌వాహా, ఆకాశ్‌దీప్, గాజీ ఖాన్, షారుఖ్ అలీ, ప్రహ్లాద్ రాజ్‌భర్ (ఫార్వర్డ్స్).


