ఆర్చరీ కోచ్‌ కుల్దీప్‌కు ఐదేళ్ల జైలుశిక్ష | Archery coach Kuldeep gets five years in prison | Sakshi
Sakshi News home page

ఆర్చరీ కోచ్‌ కుల్దీప్‌కు ఐదేళ్ల జైలుశిక్ష

May 22 2026 2:41 AM | Updated on May 22 2026 2:41 AM

Archery coach Kuldeep gets five years in prison

మైనర్‌ ఆర్చర్‌పై లైంగిక వేధింపుల కేసులో తీర్పు వెల్లడి

చండీగఢ్‌: జాతీయ స్థాయి ఆర్చరీ కోచ్‌ కుల్దీప్‌ వేద్వాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్‌ ఆర్చర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. జాతీయ శిబిరంలో శిక్షణ పొందుతున్న యువ ఆర్చర్‌ను బలవంతం చేసే ప్రయత్నం చేసిన కుల్దీప్‌ వేద్వాన్‌కు ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్స్‌ (పోక్సో) చట్టం కింద శిక్ష విధించినట్లు హరియాణాలోని సోనీపత్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది. 

జైలు శిక్షతో పాటు రూ. 15 వేలు జరిమానాగా విధించింది. కుల్దీప్‌ నేరాన్ని అంగీకరించగా... జస్టిస్‌ నరేంద్ర సింగ్‌ తీర్పు వెల్లడించారు. దీంతో అతడిని తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. ‘పోక్సో’ చట్టంలోని 10వ సెక్షన్‌ కింద అతడికి శిక్ష విధించినట్లు న్యాయమూర్తి వెల్లడించారు.  

అసలేం జరిగిందంటే... 
2023 ఆగస్టులో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఆధ్వర్యంలో యూత్‌ చాంపియన్‌ షిప్‌ శిక్షణ శిబిరం నిర్వహించారు. సోనీపత్‌లో నిర్వహించిన ఆ శిబిరంలో పాల్గొనేందుకు వచి్చన ఓ జాతీయ స్థాయి మైనర్‌ ఆర్చర్‌తో కుల్దీప్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. తెల్లవారు జామున 4 గంటలకు ఆర్చర్‌ నిద్రిస్తున్న గదిలోకి వెళ్లిన కోచ్‌ కుల్దీప్‌... ఆమెను లైంగికంగా వేధించాడు. 

అతడిని ప్రతిఘటించేందుకు విఫలయత్నం చేసిన మైనర్‌ ఆర్చర్‌ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని పక్కనే ఉన్న ఇతర ఆర్చర్‌ల గదిలోకి పరుగు తీసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని బయట పెడితే కెరీర్‌ నాశనం చేస్తానని కోచ్‌ భయపెట్టడంతో యువ ఆర్చర్‌ తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. తనకు సహకరిస్తే... జాతీయ స్థాయిలో స్టార్‌ ఆర్చర్‌గా తీర్చిదిద్దుతానని పలుమార్లు ఆమెను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించాడు. 

ట్రయల్స్‌ ముగిసిన అనంతరం సింగపూర్‌లో జరిగిన ఆసియా కప్‌నకు యువ ఆర్చర్‌ ఎంపిక కాగా... ఆ సమయంలో శిబిరం సందర్భంగా జరిగిన చేదు అనుభవాన్ని ఆమె తన కుటుంబ సభ్యులతో పంచుకుంది. దీంతో వారు సోనీపత్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా... విచారణ చేపట్టిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుల్దీప్‌ గతంలో భారత సైన్యంలో సైతం పని చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement