అల్కట్రాజ్‌.. అమెరికా కాలాపానీ! | Trump wants to reopen Alcatraz as prison | Sakshi
Sakshi News home page

అల్కట్రాజ్‌.. అమెరికా కాలాపానీ!

Published Wed, May 7 2025 4:00 AM | Last Updated on Wed, May 7 2025 4:00 AM

Trump wants to reopen Alcatraz as prison

దేశంలోకెల్లా అత్యంత కరడుగట్టిన జైలు

తిరిగి తెరవాలని ట్రంప్‌ సంచలన నిర్ణయం

అమెరికాలో అత్యంత కఠినమైన జైలు అల్కట్రాజ్‌ను తెరవాలని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. శాన్‌ఫ్రాన్సిస్కో సముద్ర జలాల్లో ఉన్న ఈ జైలు ఒకప్పుడు తీవ్ర అపఖ్యాతి పాలైంది. ది రాక్‌గా ప్రసిద్ధికెక్కిన జైలు 60 ఏళ్ల కింద మూతపడింది. దశాబ్దాల క్రితం పర్యాటక ప్రాంతంగా మారింది. ఏటా లక్షలాది మంది సందర్శిస్తున్నారు. అలాంటి జైలును మళ్లీ ఉపయోగంలోకి తెచ్చేందుకు ట్రంప్‌ ప్రయతి్నస్తున్నారు. శిథిలావస్థలో ఒకప్పటి ప్రమాదకర జైలును పునరుద్ధరించడం సరికాదని నిపుణులు అంటున్నా పట్టించుకోవడం లేదు. 

అల్కట్రాజ్‌ గురించి ట్రంప్‌ 
ఈ ద్వీప జైలును తెరవడమే గాక విస్తరించాలని ఆదేశించినట్లు ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా హాండిల్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. దుర్మార్గులు, హింసాత్మక, ప్రమాదకర నేరస్తులతో అమెరికా చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అల్కట్రాజ్‌ తన దృష్టిలో శాంతిభద్రతలను కాపాడగల అతి బలమైన, శక్తివంతమైన ప్రదేశమని అనంతరం మీడియాతో కూడా చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుతం శాంతిభద్రతలు చాలా అవసరం గనుక దాన్ని మళ్లీ తెరవబోతున్నట్టు చెప్పారు. జైలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాన్ని తెరిచే ఆలోచన బాగుందన్నారు. అమెరికా పౌరులు, జాతీయ భద్రత కోసం ఇప్పుడా జైలు అత్యంత అవసరమని సరిహద్దు అధికారి టామ్‌ హోమన్‌ కూడా అన్నారు. 

షార్క్‌ల కాపలా... 
అల్కట్రాజ్‌. ఒక్కమాటలో చెప్పాలంటే అండమాన్‌లోని కరడుగట్టిన కాలాపానీ వంటి జైలు. శాన్‌ఫ్రాన్సిస్కోకు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ద్వీపంలో ఉంది. దీన్ని మొదట నావికా రక్షణ కోటగా నిర్మించారు. 20వ శతాబ్ద ప్రారంభంలో సైనిక జైలుగా మార్చారు. 1934లో అధికారికంగా ఫెడరల్‌ జైలుగా మార్చేశారు. దీని భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. తప్పించుకోజూడటమంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఎందుకంటే ద్వీపం చుట్టూ సముద్రంలో షార్కులుంటాయి. జైలు నుంచి ఎలాగోలా తప్పించుకున్నా వాటికి ఆహారంగా మారతారు. అమెరికాలోని అత్యంత క్రూరమైన నేరస్తులను ఇక్కడ ఉంచేవారు.

బలమైన సముద్ర అలలతో పాటు అతి శీతల పసిఫిక్‌ జలాలతో కూడిన అల్కాట్రాజ్‌ ఖైదీలకు అక్షరాలా నరకప్రాయం. ఈ జైలులో గ్యాంగ్‌స్టర్‌ అల్‌ కాపోన్, జార్జ్‌ మెషీన్‌ గన్‌ కెల్లీ వంటి కరడుగట్టిన నేరస్తులను ఉంచారు. దీనిపై అనేక సినిమాలు వచ్చాయి. నిర్వహణ అత్య ంత ఖరీదుగా మారడంతో 1963లో అటార్నీ జనరల్‌ రాబర్ట్‌ కెన్నెడీ దీని మూసివేయించారు. ఈ జైలు, ద్వీపం ఇప్పుడు నేషనల్‌ పార్క్‌ సరీ్వస్‌ నిర్వహణలో ఉన్నాయి. ఏటా 14 లక్షల మంది దీన్ని సందర్శిస్తున్నారు. 

గతంలోనూ ప్రయత్నాలు 
ఈ కేంద్రాన్ని డిటెన్షన్‌ సెంటర్‌గా తెరవాలని గతంలోనూ పలువురు నేతలు విఫలయత్నం చేశారు. 1981లో ‘మారియల్‌ బోట్‌ లిఫ్ట్‌’లో క్యూబా నుంచి ఫ్లోరిడాకు వచి్చన 20,000 మంది శరణార్థులను ఉంచడానికి నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రతిపాదించిన 14 ప్రాంతాల్లో ఇదీ ఉకటి. చారిత్రక పర్యాటక ప్రదేశం కావడం, అంతమందికి సౌకర్యాలు లేకపోవడంతో వెనక్కు తగ్గారు.

నిర్వహణ అసాధ్యమంటున్న నిపుణులు..
అల్కట్రాజ్‌ను తిరిగి తెరవడంపై జైలు నిపుణులు, చరిత్రకారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట ఈ విషయం వినగానే జోక్‌ అనుకున్నట్టు బీఓపీ తాత్కాలిక డైరెక్టర్‌గా చేసిన హ్యూ హుర్విట్జ్‌ చెప్పారు. ‘‘దాన్ని మరమ్మతు చేయాలనుకోవడం హాస్యస్పదం. ఆరడుగుల వ్యక్తి నిటారుగా నిలబడలేని గదులతో కూడిన భవనాలవి. పైగా కూలిపోతున్నాయి. సరైన భద్రత, ఫెన్సింగ్, కెమెరాలు కూడా లేవు. ఆ జైలును ఇప్పుడు నడపడం అసాధ్యమన్నారు. ‘‘1963లో జైలును మూసినప్పుడు ఖైదీల తలసరి నిర్వహణ ఖర్చు 13 డాలర్ల దాకా ఉండేది. ఇతర ఫెడరల్‌ జైళ్లలో అది ఐదు డాలర్లలోపే. ఇప్పుడు ఇతర జైళ్లలోనే 120 డాలర్లకు పెరిగింది. ఆ లెక్కన అల్కట్రాజ్‌లో కనీసం 500 డాలర్లు కావాలి. అంతంత వెచి్చ ంచి దోషులను అక్కడుంచడం చాలా ఖరీదైన వ్యవహారం’’అని చరిత్రకారుడు జాన్‌ మార్టిని తెలిపారు.     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

అమెరికాలో అత్యంత కఠినమైన జైలు అల్కట్రాజ్‌ను తెరవాలని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. శాన్‌ఫ్రాన్సిస్కో సముద్ర జలాల్లో ఉన్న ఈ జైలు ఒకప్పుడు తీవ్ర అపఖ్యాతి పాలైంది. ది రాక్‌గా ప్రసిద్ధికెక్కిన జైలు 60 ఏళ్ల కింద మూతపడింది. దశాబ్దాల క్రితం పర్యాటక ప్రాంతంగా మారింది. ఏటా లక్షలాది మంది సందర్శిస్తున్నారు. అలాంటి జైలును మళ్లీ ఉపయోగంలోకి తెచ్చేందుకు ట్రంప్‌ ప్రయతి్నస్తున్నారు. శిథిలావస్థలో ఒకప్పటి ప్రమాదకర జైలును పునరుద్ధరించడం సరికాదని నిపుణులు అంటున్నా పట్టించుకోవడం లేదు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement