
ఐదేళ్ల తర్వాత ప్రారంభం కానున్న యాత్ర
13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం
వివరాలను వెల్లడించిన విదేశాంగ శాఖ
ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు రూ.2 లక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కైలాస మానససరోవర యాత్ర ఐదేళ్ల తర్వాత త్వరలోనే మళ్లీ మొదలుకానుంది. యాత్రకు వెళ్లాలనుకునే వారు ఈనెల 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. తొలి యాత్ర జూన్ 30న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ సంబంధిత ఉత్తరఖండ్, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపింది. యాత్రకు సంబంధించిన వివరాలను రెండు రోజుల క్రితం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. కరోనా సమయంలో బ్రేక్ పడిన ఈ యాత్రకు కేంద్రం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్దపడుతున్నారు.
పాస్‌పోర్టే తొలి అర్హత
యాత్రలో పాల్గొనే వారు భారత పౌరుడై, కచి్చతంగా పాస్‌పోర్టు కలిగి ఉండాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ పాస్‌పోర్టే తొలి అర్హతని ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పాస్‌పోర్టుకు 6 నెలల వ్యాలిడిటీ ఉండాలి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18–70 ఏళ్ల మధ్య వయసు్కలై ఉండాలి. బీఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్) 25, అంతకంటే తక్కువ ఉన్న వారినే యాత్రకు అనుమతి ఇస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేప్పుడు అన్ని కాలమ్‌లను కచ్చితంగా పూర్తి చేయాలి. ఒక్క కాలమ్ నింపకున్నా సిస్టం ఆ దరఖాస్తును తీసుకోదు. పాస్‌పోర్టు మొదటి పేజీ, చివరి పేజీని అప్‌లోడ్ చేయాలి. ఒక అకౌంట్ నుంచి రెండు దరఖాస్తులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బులు, మూర్చ తదితర సమస్యలు ఉన్న వారు యాత్రకు అనర్హులు. రూట్‌ను బట్టి యాత్రకయ్యే ఖర్చు మారుతుంది. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. యాత్రికులే పూర్తిగా ఈ ఖర్చులను భరించాల్సి ఉంటుంది.
డ్రా పద్ధతిలో ఎంపిక
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారిని విదేశాంగ శాఖ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనుంది. ఎంపికైన వారికి ఈ–మెయిల్, మొబైల్ నంబర్‌కు మెసేజ్ అందుతుంది. యాత్రికులు ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇన్‌స్టిట్యూట్, ఐటీబీపీ బేస్ హాస్పిటల్‌లో నిర్వహించే నిర్థిష్ట వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్) , నథులా పాస్ (సిక్కిం) ఈ రెండు ప్రాంతాల నుంచి యాత్ర కొనసాగనుంది. డ్రా తర్వాత ప్రయాణికుల బ్యాచ్‌ను, మార్గాన్ని నిర్దేశిస్తారు. యాత్ర ప్రారంభమయ్యేది దేశ రాజధాని ఢిల్లీ నుంచే. యాత్రలో ఇప్పటికే నాలుగుసార్లు పాల్గొన్న వారిపై తాత్కాలికంగా నిషేధం ఉంది. ఇతర వివరాలను 011–23088133 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా సమాచారం తెలుసుకోచ్చు.
సమ్మతి పత్రంపై సంతకం తప్పనిసరి
పర్వత ప్రాంతంలో 19,500 అడుగుల ఎత్తులో కొనసాగే మానససరోవర యాత్రలో భక్తులు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అననుకూల పరిస్థితుల్లో ట్రెక్కింగ్ చేసే అవసరం కూడా రావచ్చు. శారీరకంగా ఆరోగ్యంగా లేని వారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలూ ఉన్నాయి. యాత్ర సమయంలో ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాలతో యాత్రికులు మరణించినా, గాయపడినా భారత ప్రభుత్వం బాధ్యత వహించదు. మరణించే యాత్రికులను దహన సంస్కారాల కోసం తిరిగి తీసుకువచ్చే బాధ్యతను కూడా తీసుకోదు. అందువల్ల చైనా భూభాగంలో దహనం చేయడానికి ముందుగానే సమ్మతి పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది.