
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో ద్వితీయ స్థానం
గుర్రంపోడు : ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ తర్వాత నల్లగొండ జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. మంగళవారం లారీల సమస్య ఎక్కువగా ఉన్న గుర్రంపోడు, కొప్పోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు లారీలను సరిపడా పంపేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.లారీలు సరిపడా లేకపోతే అదనంగా స్థానికంగా లారీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి దళారీలు ధాన్యం తీసుకువస్తే కేసులు నమోదు చేస్తున్నామని, మిల్లర్లు ఇబ్బందులు పెడితే వారిపై చర్యలకు వెనుకాడబోమని అన్నారు. తనతోపాటు పౌరసరఫరాల అధికారులు, అదనపు కలెక్టర్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొప్పోలు కేంద్రంలో రికార్డులను పరిశీలించిన కలెక్టర్.. సంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ మంజుల, వ్యవసాయ అధికారి మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.
ఎర్రబెల్లి చెరువును పరిశీలించిన కలెక్టర్
నిడమనూరు : మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో గల శనిగకుంట చెరువు, ఊట్కూరు గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. ఊట్కూర్ కొనుగోలు కేంద్రంలో వారం రోజుల్లోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్వాకులను ఆదేశించారు. ఎర్రబెల్లి శనిగకుంట చెరువుకు ఎగువన ఎర్రబెల్లి గ్రామ శివారులో ఏఎమ్మార్పీ లోలెవల్ కెనాల్ ప్రవహిస్తోంది. ఈ కెనాల్ నుంచి శనిగకుంట చెరువును నింపడానికి ఎత్తపోతల పథకం నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను రెవెన్యూ, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం ఈ కెనాల్‌కు అనుబంధంగా స్థానిక రైతులు కుంటను ఏర్పాటు చేసుకుని మోటార్ల ద్వారా సాగు నీటిని మళ్లిస్తున్నారు. చెరువును మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేసి, సాగునీరందిచాలని దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలో కలెక్టర్ చెరువును పరిశీలించారు. కలెక్టర్ వెంట నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, సర్వేయర్ పోకల విజయ్, కృష్ణయ్య, ఆర్‌ఐ సందీప్, ఐబీ డీఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి